
‘సుందిళ్ల’ అభివృద్ధి పనులకు కృషి
● పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
మంథనిరూరల్/యైటింక్లయిన్‌కాలనీ: రైతులకు జీవనాధారంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సుందిళ్ల బరాజ్ ఉపయోపడేలా అవసరమైన అభివృద్ధి పనులకు తనవంతు కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం మంథని మండలం సిరిపురం సమీపంలోని సుందిళ్ల బరాజ్‌ను సందర్శించారు. బరాజ్ ప్రాంగణాన్ని పరిశీలించి నీటి నిల్వ, ఉపయోగం, ప్రయోజనాలు, సాగు విస్తీర్ణం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బరాజ్ రైతులకు ఉపయోగపడే రీతిలో అవసరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు. అలాగే రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. అంతకముందు ఎంపీకి ఆలయ ఈవో రాజ్‌కుమార్, అర్చకులు జయంత్‌శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు.
మల్లన్న సన్నిధిలో ఎంపీ పూజలు
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో సదయ్య ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అంతకుముందు కొలనూర్‌లో ఎంపీని నాయకులు దొడ్డె స్వామి, కుంచం మల్లయ్య ఆధ్వర్యంలో సన్మానించారు.