ఇక 2022లోనే కళాశాలలో చదువుతున్న మెడికల్ పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థి రోహిత్‌రెడ్డి ఆర్మూర్ మండలం అంకాపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇక 2013లో మొదటి బ్యాచ్‌కు చెందిన ఓ వైద్య విద్యార్థిని కుటుంబ కలహాలతో హైదరాబాద్‌లో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే వరుసగా శ్వేత, హర్ష, సనత్ మరణాలు మాత్రం తోటి విద్యార్థులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వీరి ముగ్గురి మరణాలు అంతుపట్టకుండా ఉండడంతో ఏం జరుగుతోందనే గందరగోళ వాతావరణం కళాశాలలో నెలకొంది. 2013లో 100 సీట్లతో నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభమైంది. తర్వాత పీజీ విద్య సైతం ప్రారంభమైంది. నగరం నడిబొడ్డున ఉన్న కళాశాలలో విద్యార్థుల వరుస మరణాలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు తోటి విద్యార్థులతో చలాకీగా ఉండడంతో పాటు వైద్యసేవలు సైతం అందజేస్తూ అకస్మాత్తుగా మరణిస్తుండడంపట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఒత్తిడి తట్టుకోలేక మరణిస్తున్నారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉందని పలువురు అంటున్నారు.