
● సీపీ రెమా రాజేశ్వరి
గోదావరిఖని(రామగుండం): కులంపేరుతో దూషించేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఈనెల 30న పౌరహక్కుల దినోత్సవం పురస్కరించుకుని పత్రికా ప్రకటన విడుదల చేశారు. డీజీపీ ఆదేశాలతో ప్రతినెలా పౌరహక్కుల దినోత్సవాన్ని కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. కొన్నేళ్ల కిందట కుల వివక్ష ఉండేదని, ప్రస్తుతం అంతగా లేకున్నా అక్కడక్కడ గ్రామాల్లో ఉన్న అసమానతలు, అంటరానితనం, కుల వివక్షను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలవారిని చైతన్యపర్చేందుకు గ్రామాల్లో పోలీ్‌స్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పౌరహక్కుల రక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్ని కులాలకు చెందిన వారితో సమావేశం నిర్వహించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం 1989 యొక్క విశిష్టత, పీవోఏ, (పోక్సో చట్టం), పీసీఆర్ (పౌర హక్కుల రక్షణ చట్టం) చట్టాలను అమలు చేసే విధానం గురించి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురానున్నామన్నారు.