వేడుకల్లో మున్సిపల్‌..... | - | Sakshi
Sakshi News home page

వేడుకల్లో మున్సిపల్‌.....

Mar 31 2023 1:34 AM | Updated on Mar 31 2023 1:34 AM

- - Sakshi

వేడుకల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మమత దంపతులు

రాజన్న సన్నిధిలో వైభవంగా సీతారాముల కల్యాణం లక్షన్నరకుపైగా భక్తుల రాక కిక్కిరిసిన ఎములాడ పురవీధులు జోగినిల సందడి నిరంతరం దర్శనాలు ఎండతాకిడికి భక్తుల బేజారు

వేములవాడ: రాజన్న సన్నిధిలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం శ్రీరామనవమి వేడుక కనులపండువగా సాగింది. కల్యాణోత్సవంలో లక్షన్నరకు పైగా భక్తులు పాల్గొన్నారు. జోగినిల సందడితో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. మున్సిపల్‌ పక్షాన స్వామివారికి ఎమ్మెల్యే రమేశ్‌బాబు, చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి దంపతులు, కమిషనర్‌ అన్సారీ, ప్రభుత్వం పక్షాన ఈవో కృష్ణప్రసాద్‌లు పట్టువస్త్రాలు సమర్పించారు. స్థానాచార్యులు ఆప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం కల్యాణ తంతును నిర్వహించారు. కన్యాదాతలుగా విజయసారథి– కరుణశ్రీ దంపతులు వ్యవహరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శివపార్వతులు నెత్తిన జీలకర్ర, చేతిలో త్రిశూలం పట్టుకుని అక్షింతలు చల్లుకుంటూ స్వామివారిని వివాహమాడారు. కల్యాణం అనంతరం భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 12బ్లాక్‌లుగా విభజించి ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రశాంతంగా స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. కల్యాణాన్ని చూసేందుకు 12ప్లాస్మా టీవీలు ఏర్పాటు చేశారు. ఆలయం ముందున్న ప్లాస్మా టీవీ వైర్‌ కట్‌ కావడంతో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి, తృటిలో ప్రమాదం తప్పింది. గుడి చెరువు ఖాళీస్థలంలో అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఏర్పాట్లను ఈవో కృష్ణప్రసాద్‌, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు కిరణ్‌కుమార్‌, నవీన్‌కుమార్‌, ఏఈవోలు హరికిషన్‌, బీ. శ్రీనివాస్‌, జయకుమారి, ప్రతాప నవీన్‌ పరిశీలించారు. కల్యాణోత్సవంలో సిరిసిల్ల జడ్జి శ్రీలేఖ, ఆర్డీవో పవన్‌కుమార్‌, తహసీల్దారు రాజారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మండుటెండకు భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడ్డారు. ప్యాంటు, షర్టులు ధరించి వేదికపైకి వీఐపీలు చేరుకోవడాన్ని కొంత మంది తప్పుబట్టారు.

నేత్ర పర్వంగా రథోత్సవం

శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను రథాలపై ఊరేగించారు. ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం భక్తుల నృత్యాల మధ్య వేణుగోపాలస్వామి వారి ఆలయం వరకు చేరుకుంది. తిరిగి అక్కడి నుంచి స్వామివారి ఆలయానికి చేరుకున్నాక అర్చకులు ప్రత్యేక పూజల నిర్వహించారు. బ్యాండు కళాకారులు వాయిద్యాల మధ్య యువకులు, హిజ్రాల న్యత్యాలతో ఆద్యంతం రథోత్సవం ఉత్సాహంగా సాగింది. దీంతో రాజన్న సన్నిధిలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక హోమగుండంలో పూర్ణాహుతి నిర్వహించారు.

పెద్దపల్లి జిల్లాలో..

అశేష భక్తజన సందోహం సమక్షంలో సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవ వేడుకలు గురువారం జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. కల్యాణాన్ని కన్నుల పండువగా తిలకించిన భక్తులు ఆనందంతో పరవశించిపోయారు. స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల నిండా వీక్షించేందకు కొత్తపల్లి, రామడుగు, గంగాధర, కరీంనగర్‌ మండలాలతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ధర్మారం, ఖిలావనపర్తి గ్రామాల్లోని సీతారామాలయాల్లో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. పెద్దపల్లి స్టేషన్‌రోడ్డులోని ఆలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి దపంతులు, శాంతినగర్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ మమతారెడ్డి దంపతులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, బీజేపీ నాయకుడు సురేశ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. గోదావరిఖని శ్రీ కోదండరామాలయంలో రామగుండం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంథనిలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పుట్ట మధు దంపతులు, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు వేడుకల్లో పాలుపంచు కున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement