20 లాడ్జిల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ పరిఽధిలో గల పలు లాడ్జిల్లో వన్‌టౌన్ పోలీసులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని సీఎంఆర్ జంక్షన్ నుంచి స్వీట్ ఇండియా వరకు 20 లాడ్జిల్లో సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విస్తృత తనిఖీలు చేశారు. వన్‌టౌన్ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరితో పాటు క్రైమ్ ఎస్సైలు సురేంద్రనాయుడు, రవిలు మూకుమ్మడిగా ఏకకాలంలో మొత్తం 20 లాడ్జిలలో సోదాలతో పాటు తనిఖీ చేశారు. రెండు రోజుల క్రితమే నగరం మొత్తం దాదాపు 120 ప్రాంతాల్లో వెయ్యి మంది సిబ్బందితో నాకాబందీ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తనిఖీల్లో దాదాపు 70 మంది వాహనాలను సీజ్ చేశారు. ఈ క్రమంలోనే వన్‌టౌన్ పోలీసులకు వచ్చిన సమాచారంతో క్రైమ్ ఎస్సై సురేంద్రనాయుడు రైల్వే స్టేషన్ వద్ద యామిని, ఎస్‌ఆర్, సామ్రాట్ లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ లాడ్జిలలోనే నెలరోజుల క్రితం కొరాపుట్ నుంచి రెండు సూట్ కేసుల్లో గంజాయితో అనుమానితులు వచ్చిన దరిమిలా పోలీసులు విస్తృతంగా ఈ తనిఖీలు నిర్వహించారు.


