అక్రమ కబేళాలు మూసివేయాలి
● ఏపీ గో సంరక్షణ సమాఖ్య డిమాండ్
విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల కంటోన్మెంట్‌లో అక్రమంగా నడుస్తున్న గో మాంసం కబేళాలు, దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్థానిక కంటోన్మెంట్ మసీదు ఎదురుగా ఉన్న బిర్యానీ సెంటర్ వెనుక బ్లూ గేట్‌తో పాటు దాని చుట్టు పక్కల యథేచ్ఛగా ప్రతిరోజూ ఆవులు, దూడలను చంపి రాష్ట్రంలో కంపెనీలకు పంపిస్తున్నారని గతంలో మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయగా వారి లైసెన్సులు రద్దు చేసినప్పటికీ కబేళాలు, షాపులను నిర్వహిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. తక్షణమే అక్రమ కబేళాలు, గో వధ శాలల మూసివేతకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని ఈ మేరకు కమిషనర్ నల్లనయ్యను మున్సిపల్ కార్యాలయంలో కలిసి నోటీసు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కేవీఆర్ సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి భీమపల్లి సంధ్యారాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పాడ పైడితల్లి, సారిక రేణుక తదితరులు పాల్గొన్నారు.


