పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్‌మెడల్స్
● వన్ టౌన్ ఏఎస్సై త్రినాథ రావు ప్రతిభ
● అభినందించిన ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైమ్: రాష్ట్ర స్థాయి డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ పోటీల్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన విజయనగరం వన్ టౌన్ ఏఎస్సై త్రినాథ్‌ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం అభినందించారు. వన్ టౌన్‌లో ఏఎస్సై పని చేస్తున్న ఆల్తి త్రినాథరావు ఇటీవల విశాఖలోని వెలమపేట శ్రీ విజయేంద్ర వ్యాయామ మండలిలో ‘పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా‘ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన ఏఎస్జై ఆల్తి త్రినాథరావు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌ను ఆయన చాంబర్ లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి, జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని అభిలషించారు. గత నెల 30న జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ సెలక్షన్స్ కమ్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మాస్టర్స్ విభాగం 60+, 93 కేటగిరిలో ఏఎస్సై త్రినాథరావు బెంచ్ ప్రెస్‌లో 95 కిలోలు, డెడ్ లిఫ్ట్‌లో 142.5 కిలోల బరువును ఎత్తి, రెండు విభాగాల్లోను బంగారు పతకాలు సాధించి, స్టేట్ సెలక్షన్స్‌కు కూడా ఎంపికయ్యారు. కార్యక్రమంలో విజయనగరం వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


