నేడు జిల్లా స్థాయి పోటీలు
పాలకొండ రూరల్: పారా ఒలింపిక్స్ అసోసియేషన్ సౌజన్యంతో మంగళవారం జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడాపోటీలు చేపట్టనున్నామని సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ పి.భానుమూర్తి తెలిపారు. 13–20 ఏళ్లలోపు 40 శాతం దివ్వాంగులైన ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో చదువుతున్న బాల బాలికలు ఈ పోటీలకు అర్హులన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో గల నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు చేపడతామని పేర్కొన్నారు. సోమవారం పాలకొండ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డీఈఓ బి.రాజ్‌కుమార్, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త తేజేశ్వరరావుల పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు. ప్రధాన రహదారి నుంచి క్రీడా వేదిక వద్దకు నడవ లేని వారి కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశామని, ఔత్సాహిక క్రీడాకారులకు భోజన వసతితో పాటు అవసరమైన క్రీడా పరికరాలు తామే సమకూరుస్తామని తెలిపారు.
జాతీయ తైక్వాండో పోటీల్లో
నేషనల్ స్కూల్ విద్యార్థికి కాంస్యం
విజయనగరం అర్బన్: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి అండర్–17 తైక్వాండో పోటీల్లో పట్టణానికి చెందిన ది నేషనల్ స్కూల్ విద్యార్థి వై.ముఖేష్ విశ్వనాఽథ్‌కు కాంస్య పతకం లభించింది. ఈ మేరకు సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతను పాఠశాల కరస్పాండెంట్ బొడ్డు రామారావు, స్కూల్ ఇన్‌చార్జ్ దీపక్, ఉపాధ్యాయులు అభినందించారు.


