అవి తిట్లు సంసారం కాదు..
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు.. ఒక టెండూల్కర్ వరుస సిక్సులు కొట్టినట్టు.. శివమణి డ్రమ్స్ కొట్టినట్టు.. శంకర్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం వాయించినట్టు.. సీఎంవో నుంచి మంత్రి సంధ్యారాణికి చీవాట్ల పరంపర కొనసాగినట్టు తెలిసింది. తన అనధికార పీఏ సతీష్ చేసిన అనైతిక కార్యకలాపాలు గిరిజన, మహిళా సంక్షేమ శాఖా మంత్రికి తలవంపులు తెచ్చాయి. దీంతో ఆమె ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయారు. దీంతో టీడీపీ అధిష్టానం, ముఖ్యంగా విద్యా శాఖ మంత్రి లోకేష్ పేషి నుంచి మంత్రికి గట్టిగా తిట్లు.. చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఇతరత్రా అంశాల కన్నా మంత్రి సంధ్యారాణి అనధికారిక పీఏ సతీష్ వ్యవహారం.. అయన దూకుడు.. దందాల అంశం ఎక్కువ చర్చకు వచ్చినట్టు తెలిసింది.
ఇన్నేళ్ల పోరాటం.. ఒక్క పీఏతో సరి
పదిహేనేళ్లుగా టీడీపీలో కొనసాగుతూ తొలిసారిగా ఎన్నికల్లో గెలిచి రెండు శాఖలకు మంత్రిగా ప్రాధాన్యపరమైన పోస్టింగులు దక్కించుకున్న సంధ్యారాణి ఒక్క పీఏ కారణంగా మొత్తం పరువు కోల్పోయారు. ఇప్పటికే ఆమెకు మహిళా శిశుసంక్షేమ శాఖతో పాటు గిరిజన సంక్షేమ శాఖను ఇచ్చి చంద్రబాబు అధిక ప్రాధాన్యం కల్పించారన్న అసూయ టీడీపీ నేతల్లో ఉండగా.. ఇప్పుడు ఏకంగా ఆమె ఇలా జనంలో పలుచన అయిపోయి పరువు పోగొట్టుకున్నారు. అంతేకాకుండా ఏకంగా ఆమె కుమారుడు కూడా ఈ వ్యవహారంలో పాత్ర ఉందని తేలడంతో ఆమె కాళ్లు చేతులు అందని పరిస్థితి నెలకొన్నది. వాట్సాప్ చాటింగులు.. బాధిత మహిళ పోలీసు ఫిర్యాదుతో సంధ్యారాణి పరిస్థితి సాలూరు ప్రజలకు మొహం చూపలేని విధంగా మారింది. అటు పార్టీ పెద్దల నుంచి వస్తున్న ప్రశ్నల పరంపరకు ఒకే సార్.. సార్.. సార్... నేను చూస్తాను సార్.. అంతా సరిదిద్దుకుంటాను... సెట్ చేస్తాను.. అనే మాట తప్ప ఇంకేం సమాధానం లేకపోయిందని ఆమె అనుచరులే చెబుతున్నారు. దీంతో ఇక అనివార్యంగా తన పీఏను తొలగించక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఏమీ తప్పు జరగనప్పుడు ఆయన్ను ఎందుకు ఉద్యోగంలోంచి తీసేశారమ్మా అనే ప్రశ్నలకు ఆమె వద్ద సమాధానం కరువైంది.
సౌండ్ లేని ఇన్‌చార్జ్ మంత్రులు
తన పొలిటికల్ కొలీగ్ సంధ్యారాణి కుమారుడు, ఆమె పీఏ ఇలా ఒక లైంగిక వేధింపుల వ్యవహారంలో చిక్కుకోగా విజయనగరం ఇన్‌చార్జ్ మంత్రి, హోమ్ మంత్రి వంగలపూడి అనిత మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ఆమె ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న విజయనగరంలోనే సాలూరు కూడా మొన్నటి వరకూ భాగం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అంశం మీద ఆమె ఈప్పటికే ఒక ప్రకటన చేయాల్సి ఉండాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సాలూరు నియోజకవర్గం ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కూడా ఈ అంశం మీద ఏమీ పెదవి విప్పడం లేదు. తమ మంత్రి కొడుకు, పీఏ ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న తరుణంలో ఆయన సైతం సైలెంట్‌గా ఉండడం ప్రజల్లో విమర్శలకు అవకాశం కలుగుతోంది. మొత్తం మీద.. కొడుకు, పీఏ చేసిన నిర్వాకాలతో పైనుంచి వస్తున్న చీవాట్లు.. సంజాయిషీ ప్రశ్నలతో సంధ్యారాణి తీవ్రంగా కలత చెందుతున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
సీఎంవో నుంచి మంత్రి
సంధ్యారాణికి చీవాట్లు
కేబినెట్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ
తప్పించుకునే మార్గం కరువు
అనివార్యంగా పీఏ సతీష్
తొలగింపు


