సమగ్ర సమాచారం ఉండాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి
పథకాలకు
సంబంధించి
పార్వతీపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతీ అధికారి వద్ద పూర్తి సమాచారం ఉండాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పలు పథకాల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో తన సమావేశ మందిరంలో కలెక్టర్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ వున్న పనుల వివరాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదలయ్యేలా చూసుకోవాలని అధికారులు తెలిపారు. పథకాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిధులు ఇతర సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో గత మూడేళ్లుగా రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపారని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ప్రధమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు, సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు నూతన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ముస్తాబు కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. చదువుతో పాటు ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం ఆనందలహరి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఈవోబి.రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆకాంక్షిత జిల్లాలలో పార్వతీపురానికి 5వ ర్యాంకు
ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో జాతీయ స్థాయిలో పార్వతీపురం మన్యం జిల్లా 5వ ర్యాంకులో నిలిచిందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. అద్భుతమైన పనితీరును కనబరిచి మార్చి 2025లో వున్న 93వ డెల్టా ర్యాంక్ నుంచి జాన్ 2025 నాటికి 4వ డెల్టా ర్యాంకుకు చేరిందన్నారు. జిల్లా యొక్క కాంపోజిట్ స్కోర్ 50.2 నుంచి 70.3కు పెరిగిందని, ఇది ఏడీపీలోని ఐదు ప్రధాన అంశాలలోనూ గణనీయమైన పెరుగుదలను ప్రదర్శించిందన్నారు. జిల్లాలో ప్రాధమిక మౌలిక సదుపాయాలు కల్పనలో మొదటి ర్యాంకును సాధించిందన్నారు. విద్య, ఆర్థిక చేరిక, నైపుణ్యం, ఆరోగ్యం, పోషకాహరం, వ్యవసాయం, నీటివనరులు, అభివృద్ధి రంగాలల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి సహకార, పోటీ సమాఖ్య వాదానికి జిల్లా కొత్త బెంచ్‌మార్క్ నెలకొల్పాయని వివరించారు.


