‘తోటపల్లి’పై చిత్తశుద్ధి లేని చంద్రబాబు సర్కార్
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
వీరఘట్టం: తోటపల్లి పాత ఆయకట్టులో వరుణదేవుని దయవల్ల ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ గెట్టెక్కిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. వీరఘట్టం శనివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునికీకరణపై చంద్రబాబు సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదట్లో నీరు లేక వరినాట్లు ముదిరిపోయే పరిస్థితి వచ్చిందని, ఇంతలో వరుణ దేవుడు కరుణించడంతో వర్షాలు కురవడంతో పాలకొండ శివారు ప్రాంత రైతులు ఉభాలు పూర్తి చేశారన్నారు. ఇలా తరచూ వర్షాలు కురవడంతో సాగునీటి కోసం రైతులు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ గట్టెక్కారన్నారు. గత ఎన్నికల్లో తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులపై తప్పుడు ప్రచారం చేసి ఓట్లు దండుకున్న చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే తోటపల్లి రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు. 25 శాతంలోపు ఈ పనులు జరిగాయనే సాకు చూపించి ఏకంగా పాత ఆయకట్టు ఆధునికీకరణ పనులు రద్దు చేశారన్నారు. తోటపల్లి ఆధునికీకరణ పనులు చేపట్టాలని శుక్రవారం శ్రీకాకుళంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావుకు వినతిపత్రం కూడా ఇచ్చామన్నారు. ఆయకట్టు దారులు తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని, 2026 ఖరీఫ్‌లో పాలకొండ శివారుకు పూర్తి స్థాయిలో నీరందేలా చర్యలు తీసుకోవాలని అంచనాల కమిటీ చైర్మన్‌కు తోటపల్లి రైతుల గోడు వినిపించామని ఎమ్మెల్సీ అన్నారు. తోటపల్లి కాలువల పనులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలసి వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎంపీపీ దమలపాటి వెంకటరమణనాయుడు, జెట్పీటీసీ జంపు కన్నతల్లి, తూడి సర్పంచ్ కుద్దిగాన వెంకటరమణ, తలవరం సర్పంచ్ శిష్టు మధుసూదనరావు, భుక్త తదితరులున్నారు.


