రాత్రి వేళల్లోనే నిత్యం కలప రవాణా!
● అక్రమంగా తరలిస్తున్నది అటవీ కలపేనా?
బొబ్బిలి: పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ, సీతానగరంతో పాటు బొబ్బిలి అటవీ ప్రాంతం నుంచి కలపను శుక్రవారం రాత్రి గుట్టుగా తరలించారు. అధికారులు ఉండని సమయం కావడంతో అక్రమార్కులు నిశ్చింతగా బొబ్బిలి పట్టణ నడిబొడ్డులో రవాణా చేస్తున్నారు. పాత బొబ్బిలి భైరి సాగరం చెరువు గట్టు మీదుగా కలపతో నిండి ఉన్న వాహనాలు తరలిపోయాయి. నిత్యం రాత్రి వేళల్లో ఇలా తరలిస్తున్నారు. ట్రాక్టర్లు, నాటు బళ్లతో వీటిని తరలిస్తున్నారు. సమీపంలోని సా మిల్లులు, రాజాం ప్రాంతంలోని మిల్లులకు వీటిని తరలిస్తున్నారు. వీటికి అనుమతులు లేకపోవడం వలన పగలైతే అధికారులు ప్రశ్నించి సీజ్ చేస్తారనే భయంతోనే వీటిని రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. అక్రమార్కులు ముందుగా కానీ లేదా కలప తరలిస్తున్న వాహనాల వెనుకగాని వెళ్తూ చేరాల్సిన ప్రాంతానికి బహిరంగంగానే తరలిస్తున్నారు. రాత్రి వేళ అయితే దర్జాగా వెళ్లొచ్చనే ఉద్దేశంతో అక్రమార్కులు తెగిస్తున్నారు. ఇప్పటికే బొబ్బిలి మండలంలోని చింపుకొండ చుట్టుపక్కల ఉన్న అటవీ విస్తీర్ణం నుంచి వీటిని తరలించుకుపోతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా మైదానంలా తయారైంది. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి చెట్లను కూడా తరలిస్తున్నారు. టేకు, మద్ది, నేరేడు, పనస వంటి కలపతో అక్రమార్కులు సులువుగా డబ్బు అర్జిస్తున్నారు. అటవీ అధికారులు స్పందించడం లేదని కొందరు, లేదు వారికి తెలియకుండా ఈ అక్రమ రవాణా జరగదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక ఫారెస్ట్ గార్డును సంప్రదించబోగా ఫోన్ స్విచ్ ఆఫ్‌గా వస్తోంది.


