ప్రమాద కేసులను త్వరితగతిన పరిష్కరించాలి : కలెక్టర్
విజయనగరం అర్బన్: జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాద కేసులను త్వరగా పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. ప్రమాదాలు చోటు చేసుకుంటున్న బ్లాక్ స్పాట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాదానికి కారణాలు గుర్తించి నివారణా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఈ మేరకు పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో 25 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని వాటిని పరిశీలించి తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను నమోదు చేసి ఐరాడ్ యాప్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. యాప్‌లో పలు మార్పులు చేయాల్సి ఉందని దీని కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అలాగే యాప్‌లో ఉన్న పెండింగ్ కేసులపై దృష్టి సారించి వాటిని క్లియర్ చేసేందుకు ఆయా శాఖలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కమిటీ చర్యలు మజ్జి అప్పారావు మాట్లాడుతూ ఎత్తు బ్రిడ్జి డౌన్ నుంచి తోటపాలెం వేళ్లే రహదారిలో నాలుగు కళాశాలలు ఉన్నాయని, విద్యార్ధులు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ స్వీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని, అలాగే రైతు బజారు దగ్గర కూడా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని కోరాతూ వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏఎస్‌పీ సౌమ్యలత, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమణి, డీటీసీ మణికుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి, పీఆర్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఐరాడ్ మేనేజర్ శ్రీధర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.


