ఖాకీ కుటుంబానికి.. భరోసా..!
● రైలు ప్రమాద మృతుడు మల్లేశ్వరరావు కుటుంబానికి రూ.75 లక్షల బీమా
● పిల్లల చదువులకు పెద్దపీట వేయాలి : ఎస్పీ
పార్వతీపురం రూరల్: విధి నిర్వహణలో విగతజీవిగా మారిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ శాఖ కొండంత అండగా నిలిచింది. విధి వక్రంచినా.. శాఖ విస్మరించదని నిరూపిస్తూ, మరణించిన కానిస్టేబుల్ మల్లేశ్వరరావు కుటుంబానికి ఎస్‌బీఐ పోలీస్ సాలరీ ప్యాకేజీ(పీఎస్‌పీ) ద్వారా మంజూరైన రూ.75 లక్షల బీమా చెక్కును ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి శుక్రవారం అందజేశారు. గత అక్టోబర్‌లో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో రైలు ప్రమాదానికి గురై కానిస్టేబుల్ మల్లేశ్వరరావు మరణించిన విషయం విదితమే. ఇంటి పెద్దను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి, ఎస్‌బీఐ అధికారులతో మాట్లాడి బీమా సొమ్ము త్వరితగతిన అందేలా ఎస్పీ చొరవ చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేకపోయినా, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం మా బాధ్యత అని ఉద్ఘాటించారు. వచ్చిన సొమ్మును వృథా చేయకుండా, పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని మల్లేశ్వరరావు సతీమణి శ్రావణికి సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ థామస్ రెడ్డి, ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ బి.భూషణ్ సాహు తదితరులు పాల్గొన్నారు.


