విజయనగరం అర్బన్: రాబోయే డిసెంబర్ 5న జరగనున్న మెగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీ య సమావేశాన్ని (మెగా టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో స్ఫూర్తిదాయకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సారి కేవలం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మాత్రమే ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులందరూ పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.40 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా అతిథులు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులను ఆహ్వానించే విధానం, పిల్లల అకడమిక్ ప్రగతిపై చర్చించే తీరు గురించి వివరంగా సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో స్వాగతోపన్యాసం తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆ తర్వాత విద్యార్థులతో శతక పద్యం లేదా కథ చెప్పించాలని కలెక్టర్ సూచించారు. ఏ విధమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో యూ.మాణిక్యంనాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతిశ్రీ, సోషల్ వెల్ఫేర్ డీడీ ఎం.అన్నపూర్ణమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, డిప్యూటీఈవోలు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.


