గిరిజనుల జీవనోపాధి మెరుగుపడాలి
● పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ
సీతంపేట: గిరిజనుల జీవనోపాధి మెరుగుకు చర్యలు తీసుకోవాలని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర ప్రభారీ ఆఫీసర్ డాక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. సీతంపేట ఏజెన్సీలో ఆమె గురువారం పర్యటించారు. ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో నిరుద్యోగ యువతకు స్కిల్‌డెవలెప్‌మెంట్ కోర్సులపై అవగాహన కల్పించాలన్నారు. గిరిజనులు పండిస్తున్న అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం ఉండేలా చూడాలన్నారు. ఎఫ్‌పీఓ గ్రూపులకు దీనిపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ, ఉద్యానవన, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వ్యవసాయశాఖ భూసార పరీక్షల ఫలితాల నివేదికలను రైతులకు అందజేయాలన్నారు. ఆదివాసీల ఆరోగ్యం పట్ల ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు ఆస్పత్రుల్లో ప్రసవమయ్యేలా చూడాలన్నారు. అన్ని ఆస్పత్రులు 24 గంటల పనిచేసేలా చూడాలన్నారు. ప్రతి పాఠశాలలోనూ మరుగుదొడ్లు ఉండాల్సిందేనన్నారు. వీడీవీకేల ద్వారా జీడి ప్రాసెసింగ్ యూనిట్లు బాగా పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. అనంతరం మెట్టుగూడ జలపాతాన్ని సందర్శించారు. అంతకుముందు భారత రా జ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీడీఏలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా వైద్యాశాఖాధికారి భాస్కరరావు, ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, జిల్లా హార్టీకల్చర్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి, డీడీ అన్నదొర, పీహెచ్‌ఓ ఎస్.వి.గణేష్, తదితరులు పాల్గొన్నారు.


