రూ.4,000 ఇస్తే.. పాస్ గ్యారెంటీ!
చికెన్
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్య పరీక్ష కేంద్రాల్లో దర్జాగా చూసిరాతల పర్వం కొనసాగుతోంది. ఒప్పందం ప్రకారం ముందుగా విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసి.. వారికి ప్రశ్న పత్రాలను అందిస్తున్నారు. దీంతో కేంద్రాల దగ్గర్లోని జిరాక్స్ కేంద్రాల నుంచి జవాబులను మైక్రో జిరాక్స్‌లు తీయించుకుని అభ్యర్థులు దర్జాగా పరీక్షలు రాస్తున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో యథేచ్ఛగా సాగుతున్న మాస్ కాపీయింగ్ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏయూ దూరవిద్య కేంద్రం పరిధిలో రెండు రోజుల కిందట పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి భారీగా నగదు వసూలు చేసి.. పరీక్షలకు ముందుగానే ప్రశ్నలు అందిస్తోందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4,000 వసూలు చేసి, వారికి పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రశ్నలకు సమాధానాలను మైక్రో జిరాక్స్‌ల రూపంలో సిద్ధం చేసుకుని అభ్యర్థులు పరీక్ష హాలులోకి దర్జాగా వెళుతున్నారు. డబ్బులు చెల్లించిన వారందరినీ ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారు. రాసిన స్లిప్‌లను ఎప్పటికప్పుడు తొలగించేలా పక్కాగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ అక్రమాల బాగోతం సోషల్ మీడియా సాక్షిగా బయటపడింది. ప్రగతి కాలేజీ ఎదుట ఉన్న ఓ జిరాక్స్ సెంటర్ వద్ద కొందరు విద్యార్థులు డబ్బుల వసూలు, కాపీయింగ్ కోసం చేసిన ఏర్పాట్ల గురించి బహిరంగంగా మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. పరీక్షకు ఒక్కొక్క అభ్యర్థి రూ.4 వేలు చెల్లించినట్టు ఓ అభ్యర్థి చెప్పడం దుమారం రేపింది. ఇందులో స్పష్టంగా డబ్బులు ఇచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఏయూ ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు.
పరీక్ష కేంద్రం తనిఖీ
ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో ఏయూ దూర విద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య అప్పలనాయుడు.. విశ్వవిద్యాలయం నుంచి ప్రత్యేక తనిఖీ బృందాన్ని బుధవారం కొత్తవలసకు పంపించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ప్రగతి కళాశాల కేంద్రంలో మాస్ కాపీయింగ్ చేస్తున్న ఏడుగురు విద్యార్థులను, ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తున్న ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఏటా ఇదే తంతు..
దూరవిద్యా కేంద్రంలో పరీక్షల తీరు ప్రతి ఏడాది ‘షరా మామూలే’ అన్నట్టుగా సాగుతోందని ఈ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. దూర విద్యా పరీక్షలు ప్రైవేట్ కళాశాలల పాలిట కనకవర్షం కురిపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఏటా మాస్ కాపీయింగ్ జరుగుతున్నా కళాశాలల యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. యథారాజా తథాప్రజా చందంగా పరీక్షల నిర్వహణ కొనసాగిస్తూ కాసులు దండుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని దూర విద్య ప్రతిష్టను కాపాడాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
కొత్తవలసలో బయటపడిన మాస్ కాపీయింగ్ దందా
ఏయూ దూరవిద్య పరీక్షల్లో వెలుగుచూసిన బాగోతం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఆకస్మిక తనిఖీలో చూసిరాస్తూ పట్టుబడిన విద్యార్థులు
రూ.4,000 ఇస్తే.. పాస్ గ్యారెంటీ!


