అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే
● జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ
కార్యదర్శి కృష్ణప్రసాద్
విజయనగరం లీగల్: మన దేశ రాజ్యాంగం సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అని ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదేనని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఫూల్‌బాగ్‌లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చారిత్రక రోజును పురస్కరించుకుని రాజ్యాంగ విలువలు పౌరహక్కులు, బాధ్యతలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం 1946 సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజును రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నామని రాజ్యాంగం చరిత్ర గురించి తెలిపారు. పౌరహక్కులు, బాధ్యతలపై విద్యార్థులకు వివరించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో యువత పాత్రపై సూచనలు చేశారు. వరకట్న వ్యతిరేక చట్టం 1961వ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చిందని, కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరాలేనని విద్యార్థులు, సిబ్బందికి తెలిపారు. అనంతరం న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సీవీఆర్ రామ్మూర్తి, టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, నేచర్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ జి.దుర్గ పాల్గొన్నారు.
అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే


