మృతుల కుటుంబాలకు అండగా పోలీసుశాఖ
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తూ, రైలుప్రమాదంలో మృతి చెందిన బొబ్బిలి రామకోటి కుటుంబానికి స్టేట్ బ్యాంకు పోలీసు సేలరీ ప్యాకేజ్ ప్రయోజనంగా మంజూరు చేసిన రూ.కోటి చెక్కును ఆయన భార్య సీహెచ్.రమకు ఎస్పీ దామోదర్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న పోలీసు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, అందరికీ స్టేట్ బ్యాంకు పోలీసు సేలరీ ప్యాకేజీని ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఈ ప్యాకేజీ ప్రయోజనంలో భాగంగా ఎవరైనా పోలీసు ఉద్యోగి విధి నిర్వహణలో భాగంగా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.1కోటి ఆర్థిక సహాయం ఎస్బీఐ అందించనుందన్నారు. ఇందులో భాగంగా కొత్తవలస పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా బొబ్బిలి రామకోటి పని చేస్తూ, రైలు ప్రమాదంలోఈ ఏడాది ఫిబ్రవరి 2న మరణించాడన్నారు. ఇదే విషయమై స్టేట్ బ్యాంకు అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపగా మరణించిన బొబ్బిలి రామకోటి భార్య రమకు కోటి రూపాయలు మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎబ్బీఐ రీజనల్ మేనేజరు ఎం.సురేష్ బాబు, ఎస్బీఐ కంటోన్మెంట్ చీఫ్ మేనేజరు పి.రఘురామ్, ఎస్బీఐ ఆర్బీఓ చీఫ్ మేనేజరు విజయకుమార్, ఎస్బీఐ డిపాజిట్స్ మేనేజరు ఒమ్మి వెంకటరావు, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఉషారాణి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు, పోలీసుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


