గంజాయి తరలింపుపై డ్రోన్లతో నిఘా
పార్వతీపురం రూరల్: గంజాయి తరలింపుపై డ్రోన్లతో నిఘా పెట్టాలని, నేరస్తుల ఆస్తులు జప్తు చేయాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కొత్త చట్టాల ప్రకారం నిర్ణీత గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. కొత్త చట్టాల ప్రకారం 60 లేదా 90 రోజుల్లోగా కోర్టుల్లో అభియోగపత్రాలు సమర్పించాలన్నారు. ఏడేళ్లు పైబడి శిక్ష పడే కేసుల్లో క్లూస్ టీమ్ ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణుల ద్వారా ఆధారాలు సేకరించాలని, ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితుల ఆస్తులను జప్తు చేయాలన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ చూపిన సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


