ఈవీఎంల గోదాం తనిఖీ
పార్వతీపురం రూరల్: పార్వతీపురం పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీలో భాగంగా గోదాంను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన వెంట డీఆర్వో కె.హేమలత, తహసీల్దార్ ఎం.సురేష్ ఉన్నారు.
డిసెంబర్ 5న
మెగా పేరెంట్–టీచర్ డే
● హాజరుకానున్న విద్యాశాఖ మంత్రి లోకేశ్
వీరఘట్టం: రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేనెల 5న మెగా పేరెంట్–టీచర్ డేను ప్రతిపాఠశాలలో నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమాన్ని ఓ పండగలా చేపట్టాలని సూచించింది. విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలను తల్లిదండ్రులకు తెలియజేయాలని పేర్కొంది. పాలకొండ నియోజకవర్గంలో నిర్వహించే పేరెంట్–టీచర్ డేకు విద్యాశాఖ మంతి నారా లోకేశ్ హాజరుకానున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఆర్‌జేడీ విజయకుమార్, డీఈఓ రాజ్‌కుమార్, పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి వీరఘట్టం జిల్లా పరిషత్ హైస్కూల్, పాలకొండ మండలంలోని ఎం.సింగుపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌తో పాటు భామిని మండలంలోని ఏంపీ మోడల్ స్కూల్‌ను పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణ అనుకూలతలను ప్రభుత్వానికి నివేదించినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే, లోకేశ్ హాజరయ్యే కార్యక్రమానికి సీఎస్పీ రోడ్డు పక్కనే సుమారు 5 ఎకరాల మైదానం కలిగిన వీరఘట్టం జిల్లా పరిషత్ హైస్కూల్ అనుకూలంగా ఉంటుందని నివేదిక ఇచ్చినట్టు సమాచారం.
నేడు ఐటీడీఏలో విచారణ
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ బుధవారం జరగనుందని దళిత ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ దుర్గాసి గణేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ బదిలీలు, నిధుల దుర్వినియోగంపై ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ విచాణరకు ఆదేశించారన్నారు. ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు.
హెల్త్ సర్వే అడ్డుకున్న కొఠియా పోలీసులు
సాలూరు రూరల్: ఏఓబీ వివాదస్పద కొఠియా గ్రామాలైన ఎగువ శెంబిలో ఆంధ్రా హెల్త్ సిబ్బంది సర్వే నిర్వహిస్తుండగా కొఠియా అధికారులు మంగళవారం అడ్డుకున్నారు. అక్కడి గిరిజనులు ఆంధ్రాలో కలిసి ఉంటా మని చెబుతున్నా ఒడిశా అధికారులు మాత్రం ఆంధ్రా అధికారులను అడ్డుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఒడిశా అధికారులు మరింత దౌర్జన్యానికి దిగుతున్నారని ఆంధ్రా సిబ్బంది ఏ పని చేసినా అడ్డుకుంటున్నారని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.


