ఆటో, స్కూటీ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని ఎంబేరేయగుళ్లు సమీపంలోని రైస్‌మిల్లు వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, స్కూటీ ఢీకొన్నాయి. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో స్కూటీపై నుంచి వస్తున్న మీసాల అక్షయ, రుంకాన లోకేష్‌లకు తీవ్రగాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..గుర్ల మండలానికి చెందిన అక్షయ, లోకేష్‌లు నెల్లిమర్ల మండలంలోని తంగుడుబిల్లిలో జరుగుతున్న అమ్మవారి పండగకు వెళ్లారు. అక్కడి నుంచి స్కూటీపై స్నేహితులను కలిసేందుకు సతివాడలోని ఆదర్శ పాఠశాలకు వెళ్లారు. తిరిగి తంగుడుబిల్లి వెళ్తుండగా ఎంబేరేయగుళ్లు దగ్గరలోని మిల్లు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో, వీరి స్కూటీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. రోడ్డుపై గుంతలు తప్పించే క్రమంలోనే ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అక్షయ కాలు విరిగిపోగా లోకేష్ ఎడమ చేయి విరిగిపోయింది. స్థానికుల సహకారంతో 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


