పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి పక్కన నిర్మించిన బాలాలయంలో అమ్మవారు పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు పూజాదికాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఆటోను ఢీకొట్టిన స్కూటీ
● వ్యక్తికి తీవ్రగాయాలు
కొత్తవలస: అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిపై కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం గ్రామం సమీపంలో గల తాడిపూడి పంప్‌హౌస్ వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు, ఏఎస్సై సూర్యప్రకాష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రయాణికులతో ఆటో ఎస్.కోట వైపు వెళ్తుండగా ఎస్.కోట నుంచి స్కూటీపై వస్తున్న వేపాడ మండలం బొద్దాం గ్రామానికి చెందిన ఐ.రాము ఆటోను బలంగా ఢీకొట్టి పక్కకు తుళ్లిపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. ఆటో ప్రయాణికులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి 108 వాహనానికి సమాచారం అందజేయగా క్షతగాత్రుడు రామును ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సూర్యప్రకాష్ తెలిపారు.
డీడీ కేసుల్లో 25 మందికి జరిమానా
● ఇద్దరికి జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి బైక్‌లు నడుపుతున్న 25 మంది నిందితులకు రూ.10వేలు చొప్పున జరిమానా, ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ విజయనగరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్ ఆర్ తేజచక్రవర్తి, శ్రీవిద్యలు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా 18 మంది పట్టుబడటంతో కేసులు నమోదు చేసి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి వద్ద హాజరు పరచగా అందులో 17 మందికి ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున ,మరో నిందితుడికి 5 రోజుల జైలుశిక్ష విధించారు. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేయగా 9 మంది పట్టుబడటంతో వారిపై కేసులు నమో దు చేసి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ విద్య వద్ద హాజ రుపరచగా 8 మందికి రూ.10వేలు చొప్పున జరిమానా, మరో వ్యక్తికి 5 రోజుల జైలుశిక్ష విఽధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ వివరించారు.
వృద్ధుడి హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవం
పార్వతీపురం రూరల్: పాత కక్షల నేపథ్యంలో ఓ వృద్ధుడిని హత్య చేసిన కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి మంగళవారం మాట్లాడుతూ ముద్దాయికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురంలోని గాంధీ సత్రానికి చెందిన లంకకృష్ణ(33) 2019లో స్థానికుడైన సంబాన ఆదినారాయణ (58)ను హతమార్చాడు. పోలీసుల దర్యాప్తులో నేరం రుజువు కావడంతో జిల్లా రెండో అదనపు జడ్జి ఎస్.దామోదరరావు ముద్దాయికి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.1,400 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలియజేశారు. పకడ్బందీగా ఆధారాలు సమర్పించి ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన పీపీలు, పోలీసు అధికారులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
పుష్పాలంకరణలో పైడితల్లి
పుష్పాలంకరణలో పైడితల్లి


