జెండర్ సమానత్వంపై విస్తృత ప్రచారం తప్పనిసరి
పార్వతీపురం: సమాజంలో సీ్త్ర, పురుషులిద్దరూ సమానమేనని, ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. జెండర్ సమానత్వం కోసం జాతీయ ప్రచారంలో భాగంగా, మెప్మా, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, సీ్త్ర, పురుషుల సమానత్వంపై పాఠశాల, కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో వీధిలోను ప్రజలకు పూర్తిస్థాయిలో అర్థమయ్యేలా ప్రచారం చేయాలని సూచించారు. ఎక్కడైనా వివక్ష కనిపించినా, ప్రజలు సామాజిక బాధ్యతగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అధికారులు కూడా వివక్ష ఉన్నచోట చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలను కలెక్టర్ అభినందిస్తూ, సమాజానికి ఈ సమానత్వ సందేశాన్ని అందించాలని అభిలషించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎం. సుధారాణి, మెప్మా పీడీ డి.కృష్ణారావు, డా.టి.జగన్‌మోహన్‌రావు, మహిళలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి


