డిప్యూటీ తహసీల్దార్ జగన్నాథ రావు మృతి
నెల్లిమర్ల: స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఎన్నికల విభాగం డిప్యూటీ తహసల్దార్‌గా పనిచేస్తున్న వీవీఆర్ జగన్నాథ రావు (53) విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల క్రితం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ కూర్చున్న కుర్చీలోనే ఆయన కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే తొలుత మిమ్స్ ఆసుపత్రికి, తరువాత విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు కుటుంబసభ్యులు తరలించి చికిత్స అందజేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సోమవారం ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గంట్యాడ మండలం వసాది గ్రామానికి చెందిన జగన్నాథ రావు ప్రస్తుతం విజయనగరంలోని అయ్యన్నపేట రోడ్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు, 30 సంవత్సరాల క్రితం వీఆర్వో గా రెవెన్యూ శాఖలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచలంచెలుగా ఎదిగి డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి చేరుకున్నారు. జగన్నాథ రావు మరణం పట్ల తహసీల్దార్ కె.శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్‌లు శంకరరావు, సత్యనారాయణ, వీఆర్వోలు, ఎన్నికల విభాగం సిబ్బంది భాస్కర రావు, మహేష్, కార్యాలయ సిబ్బంది తీవ్ర సంతాపం ప్రకటించారు.


