29న దివ్యాంగుల క్రీడాపోటీలు
● జిల్లా క్రీడాభివృద్ధి అధికారి
ఎస్.వెంకటేశ్వరరావు
విజయనగరం: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 29న దివ్యాంగులకు క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు సోమవారం తెలిపా రు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు జిల్లా దివ్యాంగుల శాఖ నేతృత్వంలో నగరంలోని రాజీవ్ క్రీడామైదానంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈపోటీల్లో 2025 డిసెంబర్ 31 నాటికి 21 సంవత్సరాలలోపు వయస్సు గల చెవిటి, మూగ క్రీడాకారులు పాల్గొనవచ్చని వెల్లడించారు. హాజరైన క్రీడాకారులకు బ్యాడ్మింటన్ క్రీడాంశంలో పోటీలు నిర్వహించనున్నామన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు పోటీల్లో పాల్గొనవచ్చని, మరిన్ని వివరాలకు ఫోన్ 9133773485 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
వివాహిత ఆత్మహత్య
రాజాం సిటీ: మాయాప్రపంచానికి ఆకర్షితురాలైన ఓ వివాహిత భర్తను కాదనుకుని ప్రియుడు మాయలో పడి అతని వేధింపులు తాళలేక చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. ఫిర్యాదు మేరకు వివరాలను టౌన్ సీఐ కె.అశోక్‌కుమార్ వెల్లడించారు. రాజాం మండలంలోని బాలేరు గ్రామానికి చెందిన సావిత్రికి కొత్తూరు మండలం పారాపురం గ్రామానికి చెందిన ఉర్లాపు గణపతిరావుతో 2009లో వివాహమైంది. వారికి 16 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. గ్రామాల్లోకి ఫైనాన్స్ ఇచ్చేందుకు వచ్చిన పాలకొండ స్పందన ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న మన్మథకుమార్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం సావిత్రికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 2023వ సంవత్సరంలో సావిత్రికి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకుని వెళ్లి రాజాంలోని సారథి రోడ్డులో మన్మథకుమార్ కాపురం పెట్టాడు. అప్పటి నుంచి ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తుండేవాడు. జీవనోపాధి నిమిత్తం సావిత్రి ఓ షాపింగ్ మాల్‌లో జాయిన్ అయి కుమార్తెను పోషించుకుంటోంది. మన్మథకుమార్ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి అనుమానించి హింసిస్తుండడంతో ఈ నెల 23న రాత్రి తన నివాసం ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


