బూటకపు ఎన్‌కౌంటర్లపై వామపక్షాల ధ్వజం
● రౌండ్‌టేబుల్ సమావేశం
పార్వతీపురం రూరల్: అడవిలో ‘ఆపరేషన్ కగార్ మోత.. కార్పొరేట్ల దోపిడీకి తెరచాటు రాత..మావోయిస్టుల ఏరివేత సాకుతో ఖనిజ సంపదను కొల్లగొట్టే కుట్ర సాగుతోందని వామపక్ష, ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం పట్టణంలోని సుందరయ్య భవనంలో పోల ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. సీపీఎం, సీపీఐ, రెడ్‌స్టార్ పార్టీల జిల్లా కార్యదర్శులు గంగునాయుడు, మన్మథరావు, జీవా తదితరులు మాట్లాడుతూ ప్రశించే గొంతులను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ రైతాంగ పోరాటం నుంచి మన్యం వరకు నిర్బంధ కాండనే నమ్ముకున్నారని విమర్శించారు. నేరం రుజువైతే చట్టం శిక్షించాలి తప్ప..తుపాకీ గొట్టమే తీర్పు చెప్పకూడదని హితవు పలికారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తే రేపటి ప్రజా ప్రళయాన్ని ప్రభుత్వాలు తట్టుకోలేవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఐద్వా, గిరిజన, ప్రజా సంఘాల నేతలు వై.మన్మథరావు, బీవీ రమణ, లక్ష్మి, పాలక రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


