సంస్థాగత నిర్మాణంతోనే ఎస్‌హెచ్‌జీలు బలోపేతం
● వెలుగు, డీఆర్‌డీఏ
పి.డి. శ్రీనివాస పాణి
● ముగిసిన స్వయం సహాయక
సంఘాల శిక్షణ
విజయనగరం టౌన్: స్వయం సహాయక సంఘాలు రూపాన్ని కోల్పోకుండా, నిర్వీర్యం కాకుండా బలంగా ఉన్నాయంటే సంస్ధాగత నిర్మాణం బాగుండటం వలనే సాధ్యపడిందని వెలుగు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకూ టీటీడీసీలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు సంబంధించిన సిబ్బందికి మూడు రోజుల పాటూ నిర్వహించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌హెచ్‌జీలకు కావాల్సిన రుణాలు ఎంసీపీ పద్ధతిలో సభ్యులకు కావాల్సిన సమయంలో అవసరం మేరకు మాత్రమే రుణాలందిస్తున్నామన్నారు. గతంలో అవసరమున్నా లేకపోయినా రుణాలిచ్చే పద్ధతి ఉండేదని, అలాకాకుండా కొత్త పద్ధతిలో రుణాలిచ్చే విధానం ఈ ఏడాది నుంచి అమలు చేశామన్నారు. మూడు రోజుల పాటూ నిర్వహించిన శిక్షణ ఆర్థికంగా కాకుండా సభ్యుల జీవన విధానంలో మార్పునకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిల్లపేట గ్రామ సంఘానికి మార్పు అంశాలకు సంబంధించి కోటీ రూ.5 లక్షల 32 వేలు అవసరమున్నట్టు బడ్జెట్ తయారు చేశారన్నారు. దీనిలో లక్షా రూ.50వేలు గ్రామ సంఘం నుంచి, 10 లక్షల రూ.8వేలు మండల సమాఖ్య నుంచి నిధులు సమకూర్చుకోవాలని, 93 లక్షల రూ.74వేలు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మంజూరు చేసేటట్టు ప్రణాళిక తయారు చేశామన్నారు. శిక్షణలో సెర్ప్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్స్ పి.శోభారాణి, సిహెచ్.వరప్రసాద్, డీపీఎంలు చిరంజీవి, రామమోహన్, వైదేహి, మోహనరావు, ఏపీఎంలు విశ్వేశ్వరరావు, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.


