కుల దూషణ కేసుపై డీఎస్పీ విచారణ
భోగాపురం: ఇటీవల మండలంలోని ముంజేరు పంచాయితీ సిద్ధార్థ్‌నగర్ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న కాలువ నిర్మాణంలో భాగంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్‌నగర్ కాలనీకి చెందిన కొందరి మహిళలపై ముంజేరు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించినట్టు కాలనీకి చెందిన బొనెల గాయత్రితో పాటు కొందరు మహిళలు ఈ నెల 20వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కె.దుర్గాప్రసాద్ ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేశారు. అదే రోజు సిద్ధార్థ్‌నగర్ కాలనీకి చెందిన 11 మంది తమపై దౌర్జన్యం చేశారని ముంజేరు గ్రామానికి చెందిన ఎం.వాణితో పాటు మరికొందరు ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. దీనిపై డీఎస్పీ మారోతు వీరకుమార్ శనివారం ముంజేరు గ్రామంలోని సిద్ధార్థనగర్ కాలనీకి చేరుకుని విచారణ చేపట్టారు.


