అడవి బిడ్డలకు సాయం చేద్దాం రండి
పార్వతీపురం రూరల్:
పార్వతీపురం పెద్దాస్పత్రికి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స కోసం వచ్చే గిరిజనులు తికమక పడుతున్నారు. వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియదు.. చుట్టూ వైద్యసిబ్బంది కనిపిస్తున్నా ఎవరిని ఆశ్రయించాలో అర్థంకాదు. భాష రాక పోవడం, నిరక్షరాస్యతతో ఎక్కడ ఓపీ రాయించాలో తెలియని అమాయకత్వం. వీరికి సాయం అందించేందుకు.. ఓ ఆప్తుడిలా అక్కున చేర్చుకుని అండగా నిలిచేందుకు జిల్లా యంత్రాంగం ‘హెల్పింగ్ హ్యాండ్స్’ పేరుతో ఒక బృహతర్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సేవా యజ్ఞంలో భాగస్వాములు కావాలంటూ కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి యువతకు, సేవాభిలాషులకు పిలుపునిచ్చారు.
ఏం చేయాలి..?
హెల్పింగ్ హ్యాండ్.. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు. మానవత్వపు వారధి. జిల్లాలోని దళిత, గిరిజన, పేద రోగులు జిల్లా కేంద్రాస్పత్రికి వచ్చినప్పుడు భాష రాక, పద్ధతులు తెలియక ఇబ్బందులు పడకూడదన్నదే దీని ప్రధాన ఉద్దేశం. ఆస్పత్రి గేటు వద్ద రోగిని కలిసి, ఓపీ రాయించడం దగ్గర్నుంచి, వైద్యుడిని సంప్రదించడం, పరీక్షలు చేయించడం, మందులు ఇప్పించి సురక్షితంగా ఇంటికి సాగనంపే వరకు ఒక వలంటీర్ ఆ రోగికి పూర్తి తోడుగా ఉంటారు. రోగి మనసులో ఆస్పత్రి భయాన్ని పోగొట్టి, వారికి ప్రభుత్వ వైద్య సేవలను, అభాకార్డుల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందేలా చూడాలి.
పేర్లు నమోదు చేసుకోండి..
సేవ చేయాలనే ఆసక్తి ఉన్నవారు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మీరు అందించే చిన్న సహాయం.. ఒక నిరుపేద ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. రండి.. చేతులు కలుపుదాం.. ఆరోగ్యాన్ని పంచుదాం అని ఆహ్వానించారు.
యువతరం కదలిరావాలి.. సేవలో తరించాలి
మీ చేయూతే అమాయక గిరిజనులకు కొండంత ధైర్యం
ఆస్పత్రుల్లో తికమకపడే అభాగ్యులకు అండగా నిలుద్దాం రండి
అడవి బిడ్డల సేవకు కలెక్టర్
ప్రభాకరరెడ్డి పిలుపు
‘హెల్పింగ్ హ్యాండ్స్’కు రూపకల్పన
వలంటీర్లకు రెడ్‌క్రాస్ ద్వారా ప్రత్యేక శిక్షణ
సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే తపన ఉన్నవారికి ఇదొక సువర్ణావకాశం. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగ విరమణ చేసిన వారు, లేదా సెలవు రోజుల్లో ఖాళీగా ఉండే ఉద్యోగులు ఎవరైనా ఈ కార్యక్రమంలో వలంటీర్లుగా చేరవచ్చు. వలంటీర్లకు రెడ్‌క్రాస్ సొసైటీ, వైద్య నిపుణులు సీపీఆర్, ప్రథమ చికిత్సపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.


