పరీక్ష పేరుతో అక్రమ వసూళ్లు
వీరఘట్టం: పరీక్షల ఫీజుల పేరిట పదో తరగతి విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుండడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వచ్చేఏడాది మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజులు చెల్లించాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అదునుగా చేసుకుని కొన్ని పాఠశాలల సిబ్బంది విద్యార్థుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. వీరఘట్టం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ప్రతివిద్యార్థి నుంచి రూ.300లు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై కొందరు తల్లిదండ్రులు ప్రశ్నిస్తే పాస్‌ఫొటోలు, ఆన్‌లైన్‌లో ఫీజు నమోదు చార్జీల కోసం అని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ నెల 17 నుంచి 30వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా అన్ని సెబ్జెక్టులకు కలిపి రూ.125లు ఫీజు చెల్లిస్తే చాలు. డిసెంబర్ 1 నుంచి 5వ తేదీలోపు రూ.50ల అపరాద రుసుముతో రూ.175, డిసెంబర్ 6 నుంచి 10వ తేదీలోపు రూ.200 అపరాధ రుసుముతో రూ.325, డిసెంబర్ 11 నుంచి 15 లోపు రూ.500 అపరాధ రుసుముతో రూ.625లు చెల్లించాలి. గడువులోపల ఫీజు చెల్లించేవారి నుంచి రూ.125కు బదులు రూ.300 వసూలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
అంత లేదండీ...
ఈ విషమంపై పాఠశాల ప్రధానోపాద్యాయుడు బి.సొంబర వద్ద ప్రస్తావించగా అంత డబ్బులు వసూళ్లు చేయడం లేదండీ.. కేవలం రూ.300లు తీసుకుంటున్నామని సమాధానం ఇచ్చారు. విద్యార్థుల ఫొటోలు, ఆన్‌లైన్ చలనా ఖర్చులు ఉంటాయి కదా అని సమాధానం చెప్పారు.
చర్యలు తప్పవు
పదో తరగతి విద్యార్థుల నుంచి ఫీజుల కోసం ఒక్కరూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవు. పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించి విద్యార్థుల వివరాలు నమోదుచేయాలి.
– పర్రి కృష్ణమూర్తి,
ఉప విద్యాశాఖాధికారి, పాలకొండ
రూ.300లు ఫీజు చెల్లించాను
మా అబ్బాయి వీరఘట్టం హైస్కూల్‌లో ఈ ఏడాది పదో తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల కిందట పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పాడు. ఎంత అని అడిగితే రూ.300లు అని చెప్పాడు. నాకు ఫీజు ఎంతో తెలియదు. అడిగినంత ఫీజు స్కూల్‌కు వెళ్లి చెల్లించాను.
– గడగమ్మ వెంకటరావు, విద్యార్థి తండ్రి, వీరఘట్టం
పదోతరగతి పరీక్ష ఫీజు పేరిట రూ.300 వసూలు
ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా రూ.175 వసూలు
అధిక ఫీజుల వసూళ్లపై
మండిపడుతున్న తల్లిదండ్రులు
పరీక్ష పేరుతో అక్రమ వసూళ్లు


