తగ్గిన ఉసిరి..!
దిగుబడులు అంతంతమాత్రమే..
గిరిజన రైతులకు దక్కని గిట్టుబాటు ధరలు
జీసీసీ ఉన్నా ఫలితం సున్నా!
నష్టాలే..
ప్రభుత్వమే ఆదుకోవాలి
సీతంపేట:
ఈ ఏడాది ఉసిరి రైతుకు కాలం కలిసి రాలేదు. దిగుబడులు అంతంతమాత్రమే. గిట్టుబాటు ధర కూడా దక్కక దిగులు చెందుతున్నారు. ఏటా నవంబర్ నెలలో ప్రారంభమైన సీజన్ డిసెంబర్ మా సాంతం వరకు ఉంటుంది. ఈ ఏడాది ఆ స్థాయిలో దిగుబడులు లేవని రైతులు చెబుతున్నారు. మైదాన వ్యాపారులు చెప్పిన ధరలకే పంటను విక్రయిస్తు న్నారు. కావిడ ఉసిరికాయల ధర వారపు సంతల్లో రూ.500ల నుంచి రూ.650 పలుకుతోంది. గతేడాది ఇదే సీజన్లో ఒక్కో కావిడ రూ.700 నుంచి 800 మధ్యలో అమ్మేవారమని గిరిజన రైతులు చెబుతున్నారు.
మైదాన ప్రాంత వ్యాపారులదే హవా..
కారుచౌకగా ఉసిరి కాయలను కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లో అధికంగా విక్రయించి లాభాలు ఆర్జిస్తారు. ఖమ్మం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తారు. వారు పచ్చళ్లు, ఆయిల్ కంపెనీలకు సరఫరా చేస్తారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, దోనుబాయిలో గురువారం, కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలు జరుగుతాయి. ఈ సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. గిరిజన రైతులు చెప్పిన ధరలు కాకుండా వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా దళారీ వ్యాపారుల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో ఆ పంటను వ్యాపారులుకు ఇస్తారు. ఇలా కూడా గిరిజనులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది.
జీసీసీ ఉన్నా..
గిరిజన సహకార సంస్థ ఉసిరిని కొనుగోలు చేయడం లేదు. కేవలం ఎండు ఉసిరిని మాత్రమే కొనుగోలు చేస్తోంది. పచ్చి ఉసరిని మైదాన వ్యాపారులు కొనుగోలు చేయడంతో వారికే విక్రయిస్తున్నామని గిరిజనులు చెబుతున్నారు. ఉసిరిని ఎండబెట్టి విక్రయించాలంటే చాలా సమయం తీసుకుంటుందని గిరిజనులు చెబుతున్నారు.
ఏటా గిరిజన రైతులకు నష్టాలు తప్పడం లేదు. కొండకోనల్లో ఉసిరి పంట ను సేకరించడం కష్టతరమైన పని. కుటుంబమంతా శ్రమించి సేకరించిన పంటకు గిట్టుబా టు ధర రావడం లేదు.
– ఎస్.సొంబురు, ఈతమానుగూడ
ఉసిరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. పైనాపిల్, సీతాఫలం తర్వాత అతిముఖ్యమైన పంట ఇది. కొండ పోడు వ్యవసాయంలో పండిస్తాం. గిట్టుబాటు ధరలు లేవు. వారపు సంత కు తెచ్చిన ఉసిరిని ఏదో ఒక ధరకు వ్యాపారుల కు విక్రయించక తప్పడం లేదు.
– ఎస్.బెన్నయ్య, ఈతమానుగూడ
తగ్గిన ఉసిరి..!
తగ్గిన ఉసిరి..!
తగ్గిన ఉసిరి..!


