చంద్రబాబు పాలనలో.. తీరని గజ వేదన
పార్వతీపురం రూరల్: అధికారంలోకి వస్తే ఏనుగుల సమస్యను చిటికెలో పరిష్కరిస్తామన్న చంద్రబాబు హామీ.. నీటి మూటగానే మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా... మన్యం రైతులకు గజ గండం నుంచి విముక్తి లభించలేదు. ఓ పక్క ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోతుంటే.. మరోపక్క ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా మన్యం జిల్లాను వణికిస్తున్న కరిరాజులు గురువారం మళ్లీ పార్వతీపురం మండలంలోకి ప్రవేశించాయి. శుక్రవారం బండిదొరవలస సమీపంలో సంచరిస్తుండటంతో రైతులు భయంతో వణికిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతలు పూర్తయి కళ్లాల్లో రాశులుగా ఉన్న సమయంలో ఏనుగులు సంచరిస్తున్న నేపథ్యంలో భయాందోళనలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గత నాలుగు నెలల్లో వందల ఎకరాల్లో పంట నాశనమైంది. ప్రభుత్వం అనేక నిబంధనలతో విదిల్చిన పరిహారం ఏ మూలకూ సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ. 2 కోట్లు వ్యయంతో..
ఏనుగుల శాశ్వత నివారణకు ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేస్తామని, సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ప్రత్యేక విభాగం పెడతామని పాలకులు ప్రగల్భాలు పలికారు. ఇందుకోసం ఏకంగా రూ.2కోట్లు ఖర్చు చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మక్కువలో పునరావాస కేంద్రం ఏర్పాటుకు స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పిస్తామన్న మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప గడప దాటడం లేదు.
13 మంది మృతి
ఏనుగుల దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అయినా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. ఎన్నికల వేళ హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు.. తప్ప ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రజలు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు చేపడుతున్నాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 26వ తేదీలోగా కుంకీ ఏనుగుల సాయంతో జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరిలించే ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. వీటిని ముందుగా సీతానగరం మండలం గుచ్చిమిలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ జోన్‌కు తరలించి, అక్కడి నుంచి అటవీ ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కుంకీ ఏనుగులకు అవసరమైన ఆహారం, వసతి ఏర్పాటు సిద్ధం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు కూడా చేస్తున్నాం.
– ప్రసూన, జిల్లా అటవీ శాఖాధికారి,
పార్వతీపురం మన్యం


