మాతృ, శిశు మరణాల పట్ల కలెక్టర్ ఆగ్రహం
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించడం పట్ల వైద్య ఆరోగ్య శాఖపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణాలు చోటు చేసుకుంటుంటే క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పేద ప్రజల ప్రాణాల రక్షణ కోసమే ఈ యంత్రాంగం ఉందని, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. మాతృ, శిశు మరణాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నాలుగు మాతృ మరణాలు, మూడు శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. చికిత్స అందించిన వైద్యులను ప్రశ్నించి కారణాలను తెలుసుకున్నారు. కొన్ని మరణాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుందని తెలిపారు. ఆయా అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని మరణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఆశ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గర్భిణులు, బాలికలు, మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు. ముఖ్యంగా బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, కౌమర దశలో వచ్చే శారీరక మార్పులు, నైతిక విలువలు, కట్టుబాట్లు, ఆకర్షణకు ప్రలోభాలకు లొంగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్త, మహిళా పోలీసులతో కమిటీలు వేయాలన్నారు. మాతృ, శిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, డీఐవో డాక్టర్ అచ్చుతకుమారి, ఘోషాస్పత్రి గైనికాలజీ హెచ్‌వోడీ డాక్టర్ అరుణ శుభశ్రీ, డీఎల్‌వో డాక్టర్ కె.రాణి, ఐసీడీఎస్ పి.డి విమలారాణి తదితరులు పాల్గొన్నారు.


