ఎస్‌హెచ్‌జీలు స్వయం సమృద్ధి సాధించాలి
విజయనగరం టౌన్: స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలని వెలుగు, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. స్థానిక టీటీడీసీలో ఆదర్శ మండల సమాఖ్యలకు సంబంధించి శుక్రవారం వార్షిక యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేశారు. ఈ మేరకు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా దుప్పాడ గ్రామం చిల్లపేటలో నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. మోడల్ మండలాలుగా ఎంపిక చేసిన పది మండలాల్లో సమాఖ్య కార్యవర్గ సభ్యులతో పాటూ విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం సిబ్బందికి రాబోయే ఐదేళ్లలో ప్రాధాన్యత మార్పు అంశాలకు సంబంధించి వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసే విధానంపై శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తులు, సృష్టి, ప్రవర్తనలో మార్పు, సుస్ధిర జీవనోపాధులు, సామర్ధ్యం పెంపు తదితర విషయాలపై వివరిస్తామన్నారు. కార్యక్రమంలో సెర్ప్ ఐబీ యూనిట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్స్ శోభ, వరప్రసాద్, వెలుగు, డీఆర్‌డీఏ డీపీఎంలు చిరంజీవి, రామమోహన్, వైదేహి, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.
వెలుగు, డీఆర్‌డీఏ పి.డి శ్రీనివాస్ పాణి


