
ఏం కష్టం వచ్చిందో..
రాజాం సిటీ : ‘తాతయ్య, అమ్మ, నాన్న అందరూ నన్ను క్షమించండి. నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను.. అందువల్ల ఇలా చేస్తున్నాను.. ఇందులో నా తప్పు లేదు.. ఎవరినీ మోసం చేయలేదు.. నేను చేసిన తప్పుకు ఇదే పరిష్కారం.. నన్ను క్షమించండి.. పవన్ జాగ్రత్తగా ఉండు.. ఎవరి దగ్గరా మోసపోవద్దు.. తాతయ్య, అమ్మ, నాన్న, అక్కను జాగ్రత్తగా చూసుకో.. నేను లేని లోటు నువ్వు తీర్చు.. అందర్ని జాగ్రత్తగా చూసుకో...’
ఇది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు తన కుటుంబీకులకు రాసిన సూసైడ్ నోట్.
ఏం కష్టం వచ్చిందో తెలియదుకానీ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు సరైన కారణాలు తెలియరానప్పట్టకీ మృతుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజాం పట్టణ ఎస్‌ఐ వై.రవికిరణ్‌తో పాటు స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వంగర మండలం కొప్పర గ్రామానికి చెందిన బూరి శ్రీనివాసరావు(29) రాజాం పట్టణంలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా జాబ్ చేస్తున్నాడు. ఈయన బీటెక్ పూర్తి చేసి, ఉన్నత ఉద్యోగాలు నిమిత్తం ప్రయత్నిస్తున్నాడు. ఇంటికి తను భారంగా ఉండకూడదని భావించి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. 15 రోజుల క్రితం రాజాం పట్టణంలో తెలగవీధిలోని నివాసముంటున్న తన స్నేహితులు వద్దకు వచ్చి ఇక్కడే రూమ్‌లో ఉంటున్నాడు. ఇదే సమయంలో వ్యక్తిగత పనుల నిమిత్తం రెండు రోజుల క్రితం అతని స్నేహితులు బయటకు వెళ్లారు. ఇంతలో శ్రీనివాసరావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అతని తండ్రి నారాయణరావుకు అనుమానం వచ్చింది. తన కుమారుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అతని స్నేహితులకు నారాయణరావు ఫోన్ చేయగా, వారు వచ్చి చూడగా గదిలో ఫ్యాన్‌కు శ్రీనివాసరావు ఉరి వేసుకుని ఉన్నాడు. ఈ విషయాన్ని వెంటనే అతని తల్లిదండ్రులతో పాటు పోలీసులకు స్నేహితులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు తండ్రి నారాయణరావుతో పాటు బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడి మృతిని జీర్ణించుకోలేక నారాయణరావు సొమ్మసిల్లిపడిపోయాడు. తన కుమారుడు కొద్ది నెలల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడని, ఈమేరకు గ్రామంలో నాటు వైద్యం కూడా చేయించుకుంటున్నాడని పోలీసులకు తెలిపాడు. రాజాం వచ్చి ఉంటున్న తన కుమారుడు ఫోన్ ఉదయం స్విచ్ ఆఫ్ చేసి రావడంతో అనుమానం వచ్చి అతని స్నేహితులకు సమాచారం ఇచ్చామని, ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని వాపోయాడు. శ్రీనివాసరావు వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను పరిశీలించి, అందులోని విషయాలు ఆదారంగా ఆరా తీస్తున్నారు. ఏదైనా మోసానికి గురై శ్రీనివాసరావు మృతి చెంది ఉండవచ్చునని బావిస్తున్నారు. తండ్రి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రవికిరణ్ తెలిపారు. శ్రీనివాసరావు ఉరి వేసుకుని ఒక రోజు దాటి ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేశారు. రాజాం ఏరియా ఆసుపత్రిలో శవ పంచనామా అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.
కొప్పరలో విషాదం
వంగర : మండలంలో కొప్పర గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన బూరి శ్రీనివాసరావు రాజాం పట్టణంలో తన స్నేహితులు గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలియగానే గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. శ్రీనివాసరావు మృతదేహం గ్రామానికి చేరుకోగానే తల్లిదండ్రులు మజ్జిగౌరి, నారాయణరావులతో పాటు సోదరుడు పవన్‌కళ్యాణ్‌లు కన్నీరుమున్నీరుగా రోదించారు.
రాజాంలో కొప్పర యువకుడి ఆత్మహత్య
కడుపు నొప్పి భరించలేకనే ఈ ఘోరం అంటూ తండ్రి ఫిర్యాదు
మృతుడి వద్ద సూసైడ్ నోట్ లభ్యం