
ఓటేసిన వారినే కాటేసే గుణం చంద్రబాబుది: కన్నబాబు
వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురుసాల కన్నబాబు మాట్లాడుతూ.. ఓటేసిన వారినే కాటేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబేనని అన్నారు. వైఎస్సార్‌సీపీ అమలు చేసిన పథకాలను, పక్క రాష్ట్రాల్లోని పథకాలను కాపీ కొట్టి.. అంతకంటే ఎక్కువిస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. లక్ష అబద్ధాలు ఆడైనా ముఖ్యమంత్రి అవ్వాలన్నది చంద్రబాబు భావనని.. అందులో సఫలీకృతులయ్యారని విమర్శించారు. ‘50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చేతులెత్తేసిన ఘనత చంద్రబాబుది. ఎన్నికల సమయంలో హామీలు అమలు చేస్తామని బాండ్లు ఇచ్చారు. వాటి సంగతేమిటీ? రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, కూటమి మోసాలపై ప్రజలను చైతన్య పరచాలి. ఏడాది పాలనలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేదో వివరించాలి’ అని శ్రేణులకు పిలుపునిచ్చారు. మోసం చేయడంలో చంద్రబాబును గిన్నిస్‌బుక్ రికార్డుల్లో ఎక్కించవచ్చని విమర్శించారు. ‘మీరు కనిపిస్తే తొలి అడుగు కాదు.. తొలిసారిగా మిమ్మల్ని నిలదీస్తారు ప్రజలు. మా ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమన్ని నేరుగా ఇంటికి వెళ్లి తెలియజేశామ’ని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్, జమ్మాన ప్రసన్నకుమార్, ఎస్.జయమణి, పార్వతీపురం మున్సిపల్ చైర్‌పర్సన్ బి.గౌరీశ్వరి, జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.