
వెటర్నరీ కళాశాలలో వీసీఐ బృందం పర్యవేక్షణ
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(వీసీఐ) బృందం సభ్యులు బుధవారం పర్యవేక్షించారు. గుజరాత్ రాష్ట్రంలోని కామధేను యూనివర్సిటీ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.యమ్.లునగారియా, ఒడిశా వెటర్నరీ కళాశాల నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ డా.అంబికాప్రసాద్ కె.మహాపాత్ర, మహారాష్ట్ర వెటర్నరీ కళాశాల నుంచి డా.ప్రతిభా జండేతో కూడిన బృందం కళాశాలను సందర్శించింది. ఈ సందర్శనలో భాగంగా కళాశాలలో నిర్మించిన భవన సముదాయాన్ని బృందంసభ్యులు పర్యవేక్షించారు. విద్యార్థులకు సరిపడా తరగతి భవనాలు సక్రమంగా అందుబాటులో ఉన్నదీ లేనిదీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ భవనాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు సక్రమంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. కళాశాలలో మరో రెండు రోజుల పాటు పర్యవేక్షణ చేయనున్నారు. పర్యవేక్షణలో కళాశాల అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను పాల్గొన్నారు.
డీఈఓకు ఎస్టీయూ జిల్లా కమిటీ వినతి
విజయనగరం అర్బన్: ప్రభుత్వం తాజాగా ప్రకటించిన టీచర్ల బదిలీ ప్రక్రియలోని అసంబద్ధ నిబంధనలను సడలించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు బుధవారం డీఈఓ యూ.మాణిక్యంనాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2021, 2023వ సంవత్సరంలో రేషనలైజేషన్‌కు గురైన పీఎస్‌హెచ్‌ఎంలకు 2021వ సంవత్సరం ముందు పనిచేసిన ‘ఓల్డ్ స్టేషన్ పాయింట్’ను మంజూరు చేయాలని కోరారు. గత నెల 24, 25, 26 తేదీన వైద్య ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు హాజరుకాలేకపోయిన ఉపాధ్యాయులకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు. టిస్‌లో ఉన్న తప్పుల సవరణకు ఎంఈఓలకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రిఫరెన్స్ కేటగిరి ఉన్న ఉపాధ్యాయులకు వారికి ఇష్టమైన మోడల్ ప్రైమరీ పాఠశాలకు వెళ్లే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల హెచ్‌ఎంగా ఎస్‌జీటీలకు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. డీఈఓను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు కె.జోగారావు, ప్రధాన కార్యదర్శి చిప్పాడ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
శుభం చిత్రయూనిట్ సందడి
విజయనగరం టౌన్: ప్రముఖ హీరోయిన్ సమంత నిర్మించిన శుభం చిత్రయూనిట్ విజయనగరంలో బుధవారం సందడి చేసింది. ఈ మేరకు స్థానిక సప్తగిరి మల్టీప్లెక్స్‌లో సెకెండ్ షోలో ప్రేక్షకులను సినీ హీరోలు, హీరోయిన్లు షాలిని, షరియా, హర్షిత్, చరణ్, శార్వాణి, శ్రీనివాస్‌లు అలరించారు. దర్శకుడు కె.ప్రవీణ్, హాస్యనటుడు వంశీ ఇతర నటులు సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లావాసుల ఆదరణ ఎనలేనిదన్నారు. తమ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి తమలాంటి వారికి అవకాశమిచ్చి బాగా ప్రోత్సహించారన్నారు. సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తీశారన్నారు. ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడం మర్చిపోలేని అనుభూతి ఇచ్చిందన్నారు. త్వరలోనే మరిన్ని చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వెటర్నరీ కళాశాలలో వీసీఐ బృందం పర్యవేక్షణ

వెటర్నరీ కళాశాలలో వీసీఐ బృందం పర్యవేక్షణ