
నిబంధనల శాపం
పల్లె విద్యార్థులకు
● ఉచిత విద్యకు గ్రామీణ విద్యార్థుల దూరం
● ఒకటి, మూడు కిలోమీటర్ల నిబంధనలతో ఇక్కట్లు
● జిల్లాలో 302 ప్రైవేటు పాఠశాలల్లో చేరేందుకు అవకాశం
● దరఖాస్తు చేసేందుకు ఈ నెల 19 వరకు అవకాశం
● నిబంధనలు సడలించాలని కోరుతున్న తల్లిదండ్రులు, విద్యా వేత్తలు
నిబంధనలు సడలించాలి
ఉచిత సీట్లు కేటాయింపుల్లో ప్రభుత్వ నిబంధనలను సడలించాలి. విద్యార్థి నివాసం నుంచి ఒక కిలో మీటరు, మూడు కిలోమీటర్లు పరిధి విధించడం ద్వారా గ్రామీణ పేద విద్యార్థులకు సీట్లు పొందే అవకాశం లేదు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని సీట్లను కేటాయిస్తే బాగుంటుంది. దీంతో గ్రామీణ విద్యార్థులు ఉచిత సీట్లు పొందే అవకాశం కలుగుతుంది. పక్కాగా ప్రణాళికబద్ధంగా అమలు చేయాలి.
– కె.విజయగౌరి, యూటీఎఫ్ నాయకురాలు
రామభద్రపురం: విద్యాహక్కు చట్టం – 2009 ప్రకారం పేద, బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించాలి. అయితే పాఠశాల విద్యార్థి నివాసం నుంచి ఒకటి లేదా మూడు కిలోమీటర్లలోపు ఉండాలనే నిబంధన గ్రామీణ విద్యార్థులకు శాపంగా మారింది. ఈ నిబంధనలతో పట్టణాల్లోనే ప్రైవేట్ పాఠశాలలు ఉండడంతో ఆ పరిసర ప్రాంతాలకు చెందిన వారే ఉచిత విద్య సీట్లు పొందే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో సీట్లను పొందలేకపోతున్నారు.
శాపంగా మారిన నిబంధనలు
ఉచిత సీట్లు కేటాయింపుల్లో ప్రభుత్వ నిబంధనలు గ్రామీణ విద్యార్థులకు శాపంగా మారాయి. విద్యార్థి నివాసం నుంచి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో సీట్లు పొందేందుకు మొదటగా అవకాశం కల్పిస్తారు. తరువాత పరిస్థితులను బట్టి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అంటే ఒక కిలోమీటరు పరిధిలోని విద్యార్థుల సీట్లు కేటాయింపులో మిగిలి ఉంటే 3 కిలోమీటర్లు పరిధిలో ఉన్న విద్యార్థికి కేటాయించేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ పాఠశాలలు ఉండేది పట్టణాల్లోనే కనుక పట్టణ పరిసర ప్రాంతాల వారికే ఉచిత సీట్లు దక్కుతాయి. అయితే గ్రామీణ పేద విద్యార్థులకు దక్కే అవకాశం లేదు. ఈ నిబంధనలను డలించి గ్రామీణ విద్యార్థులకు కూడా సీట్లు పొందే అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు.
పేదలకు 25 శాతం ఉచిత సీట్లు..
పేద విద్యార్థులకు ఉచిత సీట్లు పొందేందుకు ప్రభుత్వం ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్, పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న అనాధలు, హెచ్‌ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు చెందిన నిరుపేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. డ్రాపౌట్లు లేకుండా చర్యలు చేపట్టడమే కాకుండా, పాఠశాలల్లో సీట్లు పొందిన విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదు. జిల్లా వ్యాప్తంగా 302 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా విద్యాహక్కు చట్టం – 2009 సెక్షన్ 12(1)సీ ద్వారా గత ఏడాది 283 పాఠశాలల్లో 1326 మంది పేద విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరిలో అధిక శాతం విద్యార్థులు ఆయా విద్యా సంస్థల్లో కొనసాగుతున్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పక్కాగా అమలు
చదువు కొనుక్కొనే స్థోమత లేని ఎంతో మంది పేద విద్యార్థులకు చదువుకు అంతరాలు, అడ్డుగోడలు ఉండకూడదని ఆలోచించి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలనే నిబంధనను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేసింది. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడంలో గతంలో అనేక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేసింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సీట్ల కేటాయింపు
ప్రభుత్వ నింబధనల ప్రకారమే సీట్లు కేటాయిపు ఉంటుంది. విద్యార్థి నివాసం నుంచి ఒక కిలోమీటరు, మూడు కిలోమీటర్లు పరిధి మాత్రమే ఉండాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి అవకాశం కల్పించడం పేద విద్యార్థులకు వరం లాంటిది. నోటిఫికేషన్ ప్రకారం అర్హులు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు పక్కాగా పాటించాలి.
– యు.మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరం

నిబంధనల శాపం

నిబంధనల శాపం