
ఆదర్శనీయులు... ఆ దంపతులు
చీపురుపల్లి: ఆదర్శం అంటే అదేదో మాటల్లో చెప్పేది కాదు చేతల్లో చూపించాలి. అందులోనూ నేత్రదానం అంటేనే భయపడిపోతున్న ఈ రోజుల్లో ఏకంగా అవయవదానం అంటే మరి ఎంత కాదనుకున్నా కాస్త భయం లేకపోలేదు. అయినప్పటికీ ప్రతీ మనిషి మరణానంతరం మిగిలేది బూడిదే కదా.. అయినా ఎందుకు అవయవ దానం చేయడానికి భయం అంటూ ప్రతీ ఒక్కరూ మాట్లాడుతుంటారు. కానీ అవయవదానం చేసేందుకు ముందుకు రావడానికి మాత్రం అడుగులు వేయరు. ఇలాంటి నేపథ్యంలో ఆ దంపతులు ఇద్దరూ ఒకే ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. తమ మరణానంతరం అవయవ దానం చేసేందుకు సిద్ధం అంటూ ముందుకొచ్చారు. అంతేకాకుండా తమ మరణానంతరం అవయవ దానం చేయడానికి తాము సిద్ధమే అంటూ మానవీయత స్వచ్ఛంద సంస్థ సిద్దం చేసిన అంగీకార పత్రాలపై సంతకాలు చేసి అందజేసి సమాజానికి ఆదర్శప్రాయులుగా నిలిచారు. వారే నెలిమర్ల మండలంలోని తంగుడుబిల్లికి చెందిన శివుకు బంగారయ్య, రామలక్ష్మి దంపతులు. బంగారయ్య తంగుడుబిల్లి గ్రామంలో గణిత ఉపాధ్యాయుడుగా పని చేస్తుండగా, రామలక్ష్మి విజయనగరం కంటోన్మెంట్ వీఆర్‌వోగా పని చేస్తున్నారు. బంగారయ్య ఆయన భార్యతో కలిసి ఎంతో గొప్పగా ఆలోచన చేసి తమ మరణానంతరం శరీరం మట్టిలో కలిసిపోకుండా మరికొంత మందికి ఉపయోగపడాలనే గొప్ప ఆలోచనతో అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో పట్టణానికి చెందిన మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బివి.గోవిందరాజులు, ప్రతినిధి విజయతో బాటు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.పి.సుధీర్‌కు మంగళవారం అంగీకార పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతటి గొప్ప వారి శరీరమైనా మట్టిలో కలిసిపోవాల్సిందేనని అలా కాకుండా అవయవదానం చేయడం ద్వారా మరికొంత మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
అతడు ఉపాధ్యాయుడు.. ఆమె వీఆర్‌వో
అవయవ దానానికి అంగీకార పత్రాల అందజేత