
జీవనోపాధికి విస్తృతంగా రుణాలు
బొబ్బిలి రూరల్: పొదుపు సంఘాల్లోని సభ్యులకు జీవనోపాధిని కల్పించేందుకు విస్తృతంగా బ్యాంకర్ల సహకారంతో లింకేజీ రుణాలందిస్తున్నామని, ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకుంటామని మెప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ గంటా వెంకట చిట్టిరాజు తెలియజేశారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మెప్మా పరిధిలో 2వేల 602 సంఘాలుండగా వాటికి రూ.275 కోట్లను రుణాలుగా అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటికే 244 సంఘాల సభ్యులకు దాదాపు 25 కోట్ల రూపాయిలను రుణాలుగా అందించామన్నారు. ప్రతి సభ్యునికి రెండు లక్షల వరకు వ్యక్తిగత రుణాలందిస్తున్నామని, చిన్నతరహా వాణిజ్య, వ్యాపారాలకు అవసరమైన మొత్తాలను పూర్తి స్థాయిలో అందించేందకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సంఘంలోని ప్రతి సభ్యురాలి వివరాలు ఆన్‌లైన్ చేశామని ఈ విధానం వల్ల నిధులు దుర్వినియోగం కావన్నారు. కొత్తగా 160 సంఘాలను తయారు చేయగా 304 పాత సంఘాలను అప్‌గ్రేడ్ చేశామని వివరించారు. రిక్షా, ఆటో, ఇతర రంగాల్లో ఉన్న కార్మికులను, పురుషులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారితో ఐదుగురు చొప్పున సంఘాలను ఏర్పాటు చేస్తున్న వారి జీవనోపాధికి అవసరమైన రుణాలనందించేందుకు బ్యాంకర్లతో సమావేశాలు జరుపుతున్నామని తెలియజేశారు. సమావేశంలో ఎంపీడీవో పి.రవికుమార్ తదితరులున్నారు.
మెప్మా పీడి చిట్టిరాజు