
ఆత్మరక్షణ విద్యలో ప్రావీణ్యం సాధించాలి
విజయనగరం: ఆత్మరక్షణ విద్య తైక్వాండోలో క్రీడాకారులు మరింత ప్రావీణ్యం సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఒలింపిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తం ఆకాంక్షించారు. ఈ మేరకు న్యూ ఆంధ్ర తైక్వాండో అసోసియేషన్ సారథ్యంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో తలపెట్టిన మూడవ నేషనల్ తైక్వాండో సెమినార్ సోమవారం ప్రారంభమైంది. ఈ సెమినార్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది క్రీడాకారులు పాల్గొనగా..క్రీడాకారులకు ఇరాన్ దేశానికి చెందిన అబ్బాస్ షేక్ నూతన మెలకువలను నేర్పించారు. నాలుగు రోజుల పాటు జరిగే శిక్షణను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని పురుషోత్తం సూచించారు. అంతర్జాతీయ యవనికపై తలపడే క్రీడాకారులకు ఈ సెమినార్ దోహపడుతుందని పేర్కొన్నారు. సెమినార్‌లో నేర్చుకున్న అంశాలను నిరంతరం సాధన చేయడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సెమినార్‌లో శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన అబ్బాస్ షేక్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి కె.శ్రీహరి, జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.