
పని కల్పించాలంటూ వేతనదారుల ఆందోళన
జియ్యమ్మవలస రూరల్: ఉపాధిహామీ పనులు కల్పించాలంటూ జియ్యమ్మవలస ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వేతనదారులు గురువారం నిరసన తెలిపారు. చెరువు, కాలువ పనులు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే 14 వరకు ఫారంపాండ్స్ పనులు చేశామని, సంబంధిత రైతులు పనులకు ముందుకు రాకపోవడంతో సమస్య ఎదురైందన్నారు. చెరువు, కాలువల అభివృద్ధి పనులు కల్పించకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
184 కేజీల గంజాయి స్వాధీనం
సాలూరు రూరల్: మండలంలోని దుగ్దిసాగరం గ్రామం వద్ద గరువారం సాయంత్రం 184 కేజీల గంజాయి పట్టుకున్నట్టు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇద్దరు వ్యక్తులు కారులో గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడిచేశామని, నిందితులు తప్పించుకున్నారన్నారు. కారుతో పాటు గంజాయిని సీజ్ చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ నరసింహమూర్తి, పోలీసులు పాల్గొన్నారు.
వేతన బకాయిలు
చెల్లించండి
జియ్యమ్మవలస రూరల్: ఎన్‌ఆర్‌ఈజీఎస్(జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లావణ్యకుమార్ దృష్టికి వేతనదారులు తమ సమస్యలు తీసుకువెళ్లారు. మండలంలోని బిత్రపాడులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు వేతనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వినిపించారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇప్పటివరకు ఉపాధి బిల్లులు చెల్లించలేదని, పనిముట్లు లేవని, ఎండల తీవ్రత దృష్ట్యా పని ప్రదేశంలో తాగునీరు, టెంట్లు ఉండేలా చూడాలని, అధికారులే రైతులతో నేరుగా మాట్లాడి ఫారంపాండ్‌ల పనులు కల్పించాలని కోరారు. సమస్యలను స్టేట్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
నందివానివలస పరిసరాల్లో ఏనుగుల గుంపు
గరుగుబిల్లి: మండలంలోని సుంకి, తోటపల్లి, సంతోషపురం, నందివానివలస గ్రామ పరిసరాల్లో గత నాలుగు రోజుల నుంచి ఏనుగులు గుంపు సంచరిస్తున్నాయి. తోటపల్లి పంచాయతీ నందివానివలస తోటల్లో గురువారం సంచరించాయి. ఏనుగులు ప్రధాన రహదారి పక్కనే ఉన్న తోటల్లో సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.

పని కల్పించాలంటూ వేతనదారుల ఆందోళన

పని కల్పించాలంటూ వేతనదారుల ఆందోళన