
మూగజీవాల సంరక్షణకు సమష్టిగా కృషి చేయాలి
చీపురుపల్లి: మూగజీవాల సంరక్షణకు సమష్టిగా కృషి చేయాలని ఆర్‌డీఓ జీవీ.సత్యవాణి అన్నారు. ఈ మేరకు స్థానిక ఆర్‌డీఓ కార్యాలయంలో సోమవారం సాయంత్రం డివిజిన్ స్థాయి జంతు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంతు సంక్షేమ చట్టం ప్రకారం పశువుల అక్రమ రవాణా చేయకూడదని హితవు పలికారు. అక్రమ రవాణా, జంతుబలులు తదితర సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖల నేతృత్వంలో పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేశారు. దేవాలయాలకు రెండు వందల మీటర్ల సమీపంలో ఎలాంటి జంతుబలులు జరగకూడదని చెప్పారు. పశువుల అక్రమ రవాణాపై పోలీస్ శాఖ పటిష్ట నిఘా అమలు చేయాలని సూచించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య ముద్రించిన క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐ జి.శంకరరావు, పశుసంవర్థకశాఖ డిప్యూటీ డైరెక్టర్ దామోదరరావు, ఎ.డి ఆర్.శారద, రాజాం మున్సిపల్ కమిషనర్ జె.రాములప్పనాయుడు, ఆర్‌డీఓ కార్యాలయం ఏఓ ఈశ్వరమ్మ, అన్ని మండలాల అధికారులు పాల్గొన్నారు.
ఆర్‌డీఓ సత్యవాణి