
సతి పదవి.. పతికి దండన!
సాక్షి, పార్వతీపురం మన్యం:
●మక్కువ మండలం మక్కువ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒంటి రామలక్ష్మి.. రెండు రోజుల కిందట సామాజిక మాధ్యమాల వేదికగా పెట్టిన ఓ సంక్షిప్త సందేశం చర్చనీయాంశంగా మారింది. ఆమె వల్ల మక్కువ గ్రామ పంచాయతీ అభివృద్ధి ఆగిపోయిందంటూ కూటమి నాయకులు దుష్ప్రచారానికి దిగా రు. పనులకు పంచాయతీ తీర్మానం ఇవ్వడం లేదంటూ ఊరంతా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. దీంతోపాటు.. ఆమె భర్త ఒంటి మోహనరావునూ ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. ‘సర్పంచ్‌ను నేను. నా భర్త కాదు. అభివృద్ధి పనులను ఎవరూ అడ్డుకోరు. ఏదైనా సమస్య ఉంటే తనతో చర్చించాలి. మా గ్రామం, పంచాయతీ అభివృద్ధి చెందాలని నేనూ కోరుకుంటున్నా. రాజకీయాలను రాజకీయాల్లానే చూడాల’ని ఆమె వివరణ ఇచ్చుకోవడం కూటమి నాయకుల వేధింపులకు అద్దం పడుతోంది.
●పాచిపెంట మండలం మోసూరు ఎస్సీ సర్పంచ్ గండిపల్లి చంటిపై కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. ఆమెతోపాటు.. భర్త రామును కూడా మాససికంగా హింసించడం ప్రారంభించారు. ఇటీవల దాదాపు 25 సంవత్సరాలుగా వారి సాగులో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలని.. మరో వ్యక్తితో సర్పంచ్ భర్తపై అధికారులకు ఫిర్యాదు చేయించారు. దీనిపై రెవెన్యూ అధికారులు సర్వేకు రాగా.. సర్పంచ్ భర్త రాము అడ్డుకున్నారని.. స్థానిక వీఆర్వోతో పోలీసు కేసు నమోదు చేయించారు. ఇదంతా ఒక దళిత సర్పంచ్‌ను వేధించాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారమే జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ప్రజలతో ఎన్నికై న గ్రామ ప్రథమ పౌరులకు కూటమి పాలనలో అవమానాలు, వేధింపులు తప్పడం లేదు. జిల్లాలోని 450 పంచాయతీల్లో అధిక శాతం సర్పంచ్‌లు వైఎస్సార్‌సీపీ వారే కావడం.. అందులోనూ మహిళలదే అగ్రభాగం అవ్వడంతో అధికార పార్టీ నాయకులు విషం చిమ్ముతున్నారు. మహిళా సర్పంచ్‌లే లక్ష్యంగా వేధింపులు పాల్పడుతున్నారు. నయానో భయానో కూటమి పార్టీలోకి కలిపేసేందామన్న వ్యూహంతో సర్పంచ్‌ల భర్తలను టార్గెట్ చేశారు. వారిపై అక్రమంగా కేసులు పెట్టడం.. వేధించడం.. చిరుద్యోగులైతే విధుల నుంచి తప్పించడం... దాదాపు పది నెలలుగా జిల్లాలో సాగుతున్న తంతు.. కూటమి నేతల కర్ర పెత్తనమిదీ!
చేసేది.. చేస్తున్నది వారే అయినా!
ప్రభుత్వపరంగా చేపట్టిన ఏ పనికై నా పంచాయతీలో సర్పంచ్ తీర్మానం ఉండాలి. ప్రస్తుతం కూటమి పాలనలో అందుకు భిన్నంగా సాగుతోంది. మెజారిటీ ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీ వారే కావడంతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. పంచాయతీలపై పెత్తనం కోసం అర్రులు చాచుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు వారిని పిలవడం సరికదా.. సర్పంచ్‌లకు తెలియకుండానే వివిధ అభివృద్ధి పనులు చేయించేసుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట చేపట్టిన పల్లె పండగ పనులకు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లను పిలవకపోవడం ఇందులో భాగమే. దీనికితోడు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను సైతం రద్దు చేయిస్తున్నారు. సాలూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో 29 గిరిశిఖర పంచాయతీలకు రహదారులు మంజూరైతే.. ఆ పనులన్నింటినీ రద్దు చేయించారు. సాలూరు మండలం బోరబందలోనూ, పురోహితునివలసలోనూ మంజూరైన అభివృద్ధి పనులను రద్దు చేయించారు. ఏమీ ఎరగనట్లు గ్రామాల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు అడ్డు తగులుతున్నారని ప్రచారం చేయిస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రధానంగా మహిళా సర్పంచ్‌ల భర్తలను కూడా లాగుతూ మానసికంగా వేధిస్తున్నారు.
పంచాయతీ ప్రథమ పౌరులపై ‘పచ్చ’ పెత్తనం కూటమి ప్రభుత్వంలో మహిళా సర్పంచ్‌లకు వేధింపులు వారి భర్తలకూ శిక్ష.. చిరుద్యోగాల నుంచి నిర్థ్ధాక్షిణ్యంగా తొలగింపు
పంచాయతీ తీర్మానాలు లేకుండానే పనులు
ప్రజాస్వామ్యం ఖూనీ
పాచిపెంట మండలం కేసలి పంచాయతీ మహిళా సర్పంచ్ భర్త ఉపాధిహామీ క్షేత్ర సహాయకునిగా చాలా ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. ఈ పంచాయతీని ఎలాగైనా కై వసం చేసుకుందామన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్‌పై వేధింపులు ఆరంభమయ్యాయి. వారి దారిలోకి రాలేదన్న అక్కసుతో సర్పంచ్ భర్తను క్షేత్ర సహాయకుని విధుల నుంచి తొలగించారు.
కొమరాడ మండలం కోటిపాం పంచాయతీలో గోశాల కోసం ఓ మహిళా సర్పంచ్ సంతకాన్నే టీడీపీ నాయకుడు ఫోర్జరీ చేశాడు. దీనిపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.