
గిరిజన విద్యార్థులకే అధిక సీట్లు
● కోర్సులపై అవగాహన సదస్సులు నిర్వహించాలి ● ఎస్టీ కమిషనర్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు
విజయనగరం అర్బన్:
కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల్లో గిరిజన విద్యార్థులకు అధిక సీట్లు కేటాయించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంబంధిత చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఎస్టీ కమిషన్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. అలాగే యూనివర్సిటీలో అందిస్తున్న కోర్సులపై గిరిజన యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. విజయనగరంలోని గాజులరేగ ప్రాంతంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ టీవీ కట్టిమణి, ఇతర అధికారులు, అధ్యాపకులతో సమావేశమై గిరిజనుల అభివృద్ధిలో యూనివర్సిటీ నిర్వహిస్తున్న పాత్ర, అందిస్తున్న కోర్సులపై సమీక్షించారు. యూనివర్సిటీ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. అంతకుముందు వీసీ, తదితరులు శంకరరావును సత్కరించారు.
పనుల పురోగతిపై ఆరా..
దత్తిరాజేరు/విజయనగరం అర్బన్: మెంటాడ మండలం కుంటినవలస వద్ద చేపడుతున్న గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులను ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ.. పనుల పురోగతిపై ఆరా తీశారు. 561 ఎకరాలలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని.. భూములు ఇచ్చిన రైతులకు రూ. 61.06 కోట్లు, అప్రోచ్ రోడ్డుకు రూ. 16 కోట్లు.. సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ. 48.61 కోట్లు కేటాయించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. జాతీయ రహదారి నుంచి విశ్వవిద్యాలయ క్యాంపస్‌కు చేరుకునేందుకు అనుసంధాన రోడ్డు పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. భవన నిర్మాణాలు త్వరతిగతిన పూర్తిచేసి వీలైనంత త్వరగా శాశ్వత భవనాలను అందుబాటులోకి తీసుకువస్తామని చైర్మన్‌కు వివరించారు. పరిశీలనలో బొబ్బిలి ఆర్డీఓ రామ్మోహనరావు, యూనివర్సిటీ ఏఓ సూర్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, విజయనగరం ఆర్డీఓ కీర్తి, తదితరులు ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలసి గిరిజన విశ్వవిద్యాలయంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న చర్యలను వివరించారు.