
ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి
మక్కువ: మండలంలోని ఎ.వెంకంపేట గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం వేతనదారులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామం నుంచి ఆటోలు, ట్రాక్టర్లతో ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని ఏపీఓ ఈశ్వరమ్మను నిలదీశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న మేట్‌లను కాదని, కొత్తగా పనికి వస్తున్న 60 ఏళ్లు పైబడిన వ్యక్తితో పాటు మరికొంతమందికి మెట్‌లుగా లాగిన్ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నుకున్న మేట్‌లను కాదని కొత్తవారికి మస్తర్లు వేసేందుకు లాగిన్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని ఏపీఓను ప్రశ్నించారు. అవగాహన లేని వారికి లాగిన్ ఇవ్వడంతో నష్టపో తున్నామన్నారు. కష్టపడి పని చేసినప్పటికీ మస్తర్లు సక్రమంగా వేయడంలేదన్నారు. తనే స్వయంగా వచ్చి మస్తర్లు వేస్తానని ఏపీఓ తెలిపినా వేతనదారులు ససేమిరా అన్నారు. ఎంపీడీఓ డి.డి.స్వరూపరాణిను కలిసి సమస్యను వివరించారు. ఏపీఓ కావాలని తాము ఎంపిక చేసిన మేట్‌లను కాదని కొత్తవారికి లాగిన్ ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఎంపీడీఓ స్పందిస్తూ తీర్మాన పత్రాలు పరిశీలించి, నిబంధనల ప్రకారం రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వేతనదారులు వెనుదిరిగారు.
పాత మేట్‌లకు బదులు కొత్త మేట్‌లకు లాగిన్ ఇవ్వడంపై ఉపాధి హామీ
వేతనదారుల ఆందోళన
ఏపీఓ ఈశ్వరమ్మను నిలదీత
సమస్య పరిష్కరిస్తామన్న ఎంపీడీఓ హామీతో ఆందోళన విరమణ

ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి