
ప్రైవేటు పాఠశాలల సమస్యలపై వినతి
బొండపల్లి: ప్రైవేటు పాఠశాలల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ ఏపీ ప్రైవే టు స్కూళ్ల యాజమాన్యం సంఘం (అప్సా) ఆధ్వర్యంలో గజపతినగరం నియోజకవర్గ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్య ప్రతినిధులు ఎంఈఓ శోభారాణి, ఎంఈఓ–2 అల్లు వెంకటరమణకి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫారం– 1 లో ప్రైవేటు స్కూళ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించిందని, ఈ నిర్ణయం వల్ల స్కూళ్ల యాజమాన్యానికి తీవ్ర సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఈనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని గుర్తు చేశారు. ప్రభుత్వంతో చర్చలు కూడా జరుగుతున్నాయ ని తెలిపారు.
పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
పార్వతీపురంటౌన్: జిల్లాలో ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత సంబంధిత అధికారులను కోరారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి డి.మంజులవీణతో కలిసి సోమవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒకేషనల్, జనరల్ గ్రూపుల నుంచి 4,914 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్టు చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకెండియర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. డి.మంజులవీణ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఇంటర్ పరీక్షల్లో జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారని, దీనికి కృషిచేసిన ప్రతి అధికారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ప్రైవేటు పాఠశాలల సమస్యలపై వినతి