
నేడు ఈసెట్, ఐసెట్ రేపు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఏపీ ఈసెట్–2025 ప్రవేశ పరీక్ష మంగళవారం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 2,184 మంది అధ్యర్థుల కోసం ఐదు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రాజాం జీఎంఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, సీతం ఇంజినీరింగ్ కళాశాల, లెండి ఇంజినీరింగ్ కళాశాల, అంతి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 7వ తేదీన ఏపీ ఐసెట్–2025 ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి జిల్లాలోని మూడు కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఈ పరీక్ష రాస్తున్న 1,548 మంది అభ్యర్థుల కోసం రాజాం జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల, గాజులరేగ ఐయాన్ డిజిటల్ జోన్, ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం షిఫ్టులుగా ఈ పరీక్ష జరుగుతుంది.
విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేత
పార్వతీపురంటౌన్: సాలూరు మండలం, శివరాంపురం గ్రామానికి చెందిన విభిన్న ప్రతిభావంతుడు అల్లు.ఉదయ్ కిరణ్‌కు వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా సుమారు రూ: 33 వేల విలువైన ల్యాప్‌టాప్‌ను ప్రత్యేక ఉప కలెక్టర్ డా.పి.ధర్మారెడ్డి సోమవారం పీజీఆర్‌ఎస్. సమావేశ మందిరంలో అందజేశారు. కడప జిల్లా డా.వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీలో మూడవ సంవత్సరం పెయింటింగ్‌లో డిగ్రీ చదువుతున్న ఉదయ్‌కిరణ్ మూగ, చెవుడుతో బాధపడుతూ విద్యనభ్యసిస్తున్నాడు. తన చదువుకు, ఉపాధికి ల్యాప్ టాప్ మంజూరు చేయాలని కోరగా, ఆ విద్యార్థికి సోమవారం ల్యాప్‌టాప్‌ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీరామమూర్తి, వికలాంగుల సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ రమణ తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వాహనం
ఢీకొని వ్యక్తి మృతి
భోగాపురం: భోగాపురం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని సోమవారం ఉదయం ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భోగాపురం గ్రామానికి చెందిన దుబ్బక సంతోష్ (37) వ్యవసాయ పనులు చేసుకుంటు కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం వేకువజామున జాతీయ రహదారి పక్కనే ఉన్న పొలానికి వెళ్లాడు. బహిర్భూమికని చెప్పి పొలంలో నుంచి జాతీయ రహదారికి అవతలి వైపు వెళ్లెందుకు రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో డివైడర్‌పై ఉన్న మొక్కల పొదల్లో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తండ్రి అప్పన్న, తల్లి ఈశ్వరమ్మ ఉన్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. మృతుని తండ్రి అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యకుమారి తెలిపారు.
రెండు పూరిళ్లు దగ్ధం
గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిభద్రలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన జక్కువ కంచమ్మ, ముడుదాపు నాగభూషణకు చెందిన పూరిళ్లు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది. కట్టుబట్టలతో బాధితులు అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న వీఆర్‌ఓ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుని నివేదికను తహసీల్దార్‌కు సమర్పించారు.

నేడు ఈసెట్, ఐసెట్ రేపు