
వేసక్ 2025కు సురవరం వ్యక్తి ఎంపిక
సంతకవిటి: మండలంలోని సురవరం గ్రామానికి చెందిన బాసా మురళి వియత్నాంలో ఈ నెల 5 నుంచి 14 వరకు జరగనున్న వేసక్ ఫెస్టివల్– 2025కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన సిల్‌చర్‌లోని అస్సాం యూనివర్సిటీలో కళల ప్రదర్శన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 2017 నుంచి పనిచేస్తున్నారు. భారత్ నుంచి ఐసీసీఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్) నుంచి ఢిల్లీకి చెందిన పూర్ణిమా రాయ్ కథక్ గ్రూప్ ఈ ఫెస్టివల్‌లో నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఈ గ్రూపునకు మురళి సాంకేతిక సహకారం కోసం ఎంపికయ్యారు. పూర్ణిమా రాయ్ కథక్ గ్రూప్ గౌతమ బుద్ధుడి జీవితంలో వివిధ ప్రధాన ఘట్టాల ఆధారంగా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నృత్యరూపకాన్ని రూపొందించగా, ఆ నృత్య రూపకాన్ని మురళి సాంకేతిక సహకారంతో క్రియాత్మకంగా తీర్చిదిద్దారు. మొత్తం 14 మంది సభ్యులతో ఆయన ఆదివారం ఢిల్లీ నుంచి వియత్నాం బయలు దేరి వెళ్లారు.

వేసక్ 2025కు సురవరం వ్యక్తి ఎంపిక